దిశ, స్పోర్ట్స్ : చైనాలో శనివారం ప్రారంభమైన ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. మొదట ఉబెర్ కప్‌లో గ్రూపు ఏలో భాగమైన మహిళల జట్టు తొలి గ్రూపు మ్యాచ్‌లో కెనడా టీమ్‌ను 4-1 తేడాతో చిత్తు చేసింది. స్టార్ ప్లేయర్లు దూరంగా ఉన్న ఈ టోర్నీలో యువ క్రీడాకారిణులు తొలి మ్యాచ్‌లో సత్తాచాటారు. తొలి మూడు గేముల్లోనే భారత్ విజయం లాంఛనమైంది. సింగిల్స్ మ్యాచ్‌ల్లో అష్మిత, ఇషారాణి, అన్మోల్ ఖర్బ్ నెగ్గగా.. డబుల్స్ మ్యాచ్‌లో ప్రియా-శ్రుతి జంట విజయం సాధించింది. నేడు సింగపూర్‌తో తలపడనుంది. ఈ నెల 30న బలమైన చైనాను ఎదుర్కొనే ముందు ఈ మ్యాచ్‌కు భారత్‌కు కీలకం కానుంది.
థామస్ కప్‌ను పురుషుల జట్టు విజయంతో ఆరంభించింది. గ్రూపు సిలో జరిగిన తొలి మ్యాచ్‌లో థాయిలాండ్‌పై 1-4 తేడాతో గెలుపొందింది. తొలి గేమ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ఓటమితో భారీ షాక్ తగిలినా.. ఆ తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గింది. సాత్విక్-చిరాగ్(డబుల్స్), లక్ష్యసేన్(సింగిల్స్) తమ మ్యాచ్‌ల్లో నెగ్గి జట్టును 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లగా..అర్జున్-ధ్రువ్ కపిల(డబుల్స్) విజయం సాధించడంతో భారత జట్టు గెలుపు లాంఛనమైంది. ఇక, చివరి సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ కూడా నెగ్గడంతో భారీ విజయం దక్కింది.