ఇట్స్ రివేంజ్ టైం.. నేడే T20 సెమీఫైనల్స్

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ టోర్నీలో విశ్వవిజేతగా నిలిచేందుకు టీమిండియా రెండు అడుగుల దూరంలో నిలిచి ఉంది.

Update: 2024-06-26 18:54 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ టోర్నీలో విశ్వవిజేతగా నిలిచేందుకు టీమిండియా రెండు అడుగుల దూరంలో నిలిచి ఉంది. గత ప్రపంచ కప్ టోర్నీల్లో చేసిన తప్పిదాలను రిపీట్ కాకుండా ఈసారి పకడ్బందీగా, సమిష్టిగా జట్టు సభ్యులు రాణిస్తే తప్పకుండా భారత్ కప్ కొట్టడం ఖాయంగా మాజీ దిగ్గజ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు. టీమిండియాతో పాటు విశ్వవిజేతగా నిలవాలని మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్, వరల్డ్ కప్ చరిత్రలోనే ఇప్పటివరకు ఫైన‌ల్‌కు చేరుకోని అఫ్గాన్, దక్షిణాఫ్రికా జట్లు సైతం ఉవ్విళ్లూరుతున్నాయి.ఇకపోతే గురువారం టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ ప్రారంభం కానున్నాయి.

తొలి మ్యాచ్ అఫ్గాన్ VS సౌతాఫ్రికా..

టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో తొలి మ్యాచ్( భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు) ట్రినిడాడ్ వేదికగా జరగనుంది. అయితే, టీ20లల్లో ఇరు జట్లు రెండు సార్లు మాత్రమే తలపడగా ఆ రెండింటిలోనూ సౌతాఫ్రికానే గెలిచింది. అయితే,ఈసారి అఫ్గాన్ జట్టు మాత్రం అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లోనూ చాలా బలంగా కనిపిస్తోంది. సూపర్-8 మ్యాచులో ఏకంగా ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును కబూలీ జట్టు ఓడించింది.అంతేకాకుండా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ (281), అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఫరూఖీ (16) అఫ్గాన్ జట్టుకు చెందిన వారే.

ఇకపొతే అప్గాన్, దక్షిణాఫ్రికా జట్లు టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇప్పటివరకు ఫైనల్స్‌కు చేరలేదు. ఈ రెండు జట్లల్లో ఏది గెలిచినా ఫైనల్ చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించడం ఖాయం. ఇక మ్యాచుకు వర్షం ముప్పు లేదు. ఒకవేళ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే సూపర్-8లో అగ్రస్థానంలో ఉన్నందున సౌతాఫ్రికా జట్టు నేరుగా ఫైనల్స్‌కు వెళ్తుంది. కాగా, ట్రినిడాడ్ పిచ్ మందకొడిగా ఉన్నందున స్పిన్నర్లకు అనుకూలించే చాన్స్ ఉంది. యావరేజ్ స్కోరు 135లోపే ఉండొచ్చని అంచనా.

రెండో మ్యాచ్ ఇండియా VS ఇంగ్లండ్..

రెండో ‌సెమీస్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య రాత్రి 8 గంటలకు గయాన వేదికగా ప్రారంభం కానుంది. 17 ఏళ్లుగా భారత్ టీ20 వరల్డ్ కప్ కొట్టనే లేదు. ఈసారి ఆ కల నేరవేరడానికి కేవలం కీలకమైన రెండు అడుగులు వేస్తే చాలు. అయితే, గత రెండేళ్ల కిందట జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లోనే భారత్ పై ఇంగ్లండ్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సారి ఆ జట్టుపై రివేంజ్ తీసుకునే టైం వచ్చింది. గత వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్లో ఆసీస్ మనల్ని ఓడించగా.. ఈసారి సూపర్-8 దశలోనే కంగారు జట్టును ఇండియా ఓడించి పగ తీర్చుకుంది.

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్లు టీ20ల్లో 23 సార్లు తలపడగా..ఇండియా 12, ఇంగ్లండ్ 11 మ్యాచుల్లో గెలిచాయి. ఇక పొట్టి కప్‌లో ఇరు జట్లు 4 సార్లు తలపడగా చెరో రెండు సార్లు గెలుపొందాయి. ఇకపోతే టీమిండియా జట్టు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లో బలంగానే ఉన్నా.. విరాట్ కోహ్లీ కుదురుకుంటే సెమీస్‌లో విజయం ఖాయమని చెప్పవచ్చు. అయితే, సెమీస్‌లో జడేజాకు బదులు సంజు శాంసన్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావించినట్లు సమాచారం.

అయితే, ఈ టోర్నీ ప్రారంభంలో ఇంగ్లండ్ జట్టు దారుణంగా విఫలమైన పడి లేచి పోరాడింది. ఆ జట్టులో సైతం బౌలింగ్, బ్యాటింగ్ పటిష్టంగానే ఉంది. ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉంది.ఒక వేళ మ్యాచ్ రద్దయితే మెరుగైన పాయింట్లతో ఇండియా నేరుగా ఫైనల్స్ చేరుకుంటుంది. గయాన పిచ్ విషయానికొస్తే మందకొడిగా ఉండటంతో బౌలర్లకు చాలా అనుకూలిస్తుంది.ఇక్కడ యావరేజ్ స్కోరు 130లోపే. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉండే చాన్స్ ఉంది.


Similar News