ఆసీస్ మీడియా‌కు బెన్ స్టోక్స్ అదిరిపోయో కౌంటర్..

ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు కూడా ముగిసి రెండు రోజులైంది.

Update: 2023-07-04 10:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు కూడా ముగిసి రెండు రోజులైంది. కానీ బెయిర్‌స్టో ఔట్ వివాదం మాత్రం ఇంకా నెట్టింట హల్​ చల్​ చేస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్​ కెప్టెన్​ బెన్​ స్టోక్స్​ను ఆస్ట్రేలియన్​ వార్త పత్రిక వ్యంగ్యంగా చిత్రీకరించగా.. దానికి స్టోక్స్​ తనదైన స్టైల్​లో రిప్లై ఇచ్చాడు. ఫన్నీ కామెంట్‌తో నోరు మూయించి నెటిజన్లను ఆకట్టుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్ స్టో ఔటైన విధానం వివాదాస్పదమైంది. చివరి రోజు తొలి సెషన్‌ ఆటలో ఇంగ్లండ్‌ 193/5గా ఉన్న సమయంలో.. కామెరూన్ గ్రీన్‌ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్ స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లోకి వెళ్లగా.. నాన్ స్ట్రైకర్ బెన్ స్టోక్స్‌ను కలిసేందుకు జానీ బెయిర్ స్టో క్రీజును వీడాడు. వెంటనే కీపర్ బంతిని వికెట్లకు కొట్టి గట్టిగా అప్పీల్ చేశాడు. బెయిర్‌స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి థర్డ్ అంపైర్‌ ఎరాస్మస్‌ నాటౌట్‌ అంటాడేమోనని అంతా అనుకున్నారు. కానీ బంతి డెడ్‌ కాలేదని భావించిన థర్డ్ అంపైర్ బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. అయితే ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆసీస్‌పై మండిపడ్డారు.

ఈ విమర్శలకు ఆస్ట్రేలియా మీడియా గట్టిగా కౌంటరిచ్చే ప్రయత్నం చేసింది. 'Crybabies' అనే క్యాప్షన్‌తో 'ది వెస్ట్' ఆస్ట్రేలియన్ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ స్టోరీకి గ్రాఫిక్ ఫొటోను వాడింది. బెన్ స్టోక్స్ పాలు తాగుతున్నట్లు ఫొటోను క్రియేట్ చేశారు. ఈ ఫొటోలో బెన్ స్టోక్స్ బోర్లాపడి ఉండగా.. ఎడమవైపు బంతి, కుడివైపు యాషెస్ కప్ ఉంది. ఈ కథనంలో ఇంగ్లండ్ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ కథనం స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ కాగా.. బెన్ స్టోక్స్ తనదైన శైలిలో స్పందించాడు. 'ఈ ఫొటోలో ఉన్న నేను అస్సలు కాదు. నేను అంత చిన్న వయసులో కొత్త బంతితో బౌలింగ్ చేయలేదు'అని వ్యంగ్యస్త్రాలు సంధించాడు.


Similar News