ఆ ఒత్తిడి మాపై లేదు : పాక్ కెప్టెన్ బాబర్ అజామ్

వన్డే ప్రపంచకప్‌ కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌లో అడుగుపెట్టనుంది.

Update: 2023-09-26 15:01 GMT

ఇస్లామాబాద్ : వన్డే ప్రపంచకప్‌ కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌లో అడుగుపెట్టనుంది. దుబాయ్ మీదుగా నేడు హైదరాబాద్‌కు చేరుకోనుంది. అయితే, పాక్ జట్టులోని కెప్టెన్ బాబర్ అజామ్‌తోపాటు చాలా మందికి భారత గడ్డపై ఆడిన అనుభవం లేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు జట్లు దైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. కేవలం ఐసీసీ ఈవెంట్‌లు, ఆసియా కప్ టోర్నీల్లోనే ఎదురుపడుతున్నాయి. భారత పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు కెప్టెన్ బాబర్ అజామ్ స్పందిస్తూ.. ఆ విషయంలో తమకు ఆందోళన లేదని చెప్పాడు. భారత్ ప్రయాణానికి ముందు మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాబర్ మాట్లాడాడు. ‘మేము ఇంతకుముందు భారత్‌లో ఆడలేదు. అయితే, ఈ విషయంలో మాపై ఒత్తిడి లేదు. మేము దానిపై రీసెర్చ్ చేశాం.’ అని చెప్పాడు. అలాగే, కెప్టెన్‌గా ఈ పర్యటన చేయడం గౌరవంగా ఉందని, ఈ సారి ట్రోఫీతో తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

అక్టోబర్ 14న భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై స్పందిస్తూ.. అహ్మదాబాద్‌లో ఆడటం కోసం ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. ‘నా సామర్థ్యానికి తగ్గ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. వ్యక్తిగత ప్రశంసలు గురించి ఆలోచించనని, నేను ఏం చేసినా జట్టుకు ఫలితం దక్కేలా ఆలోచిస్తాను. ప్రతి పర్యటనకు ముందు నేను లక్ష్యాలను నిర్దేశించుకుంటా. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి మైదానంలో 100 శాతం ప్రయత్నిస్తా.’ అని బాబర్ చెప్పాడు.

అలాగే, ఆసియా కప్‌లో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిన తర్వాత డ్రెసింగ్ రూంలో బాబర్, పేసర్ షాహీన్ షా అఫ్రిది మధ్య మాటల యుద్ధం జరిగిందని వార్తలు వచ్చాయి. దీనిపై బాబర్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాడు. ఓటమి తర్వాత చర్చలు జరగడం సహజమని, కానీ, అది వక్రీకరించబడిందని తెలిపాడు. కాగా, ప్రపంచకప్‌కు ముందు పాక్ జట్టు హైదరాబాద్‌‌లోని ఉప్పల్ స్టేడియంలో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 29న తొలి వార్మప్ మ్యాచ్‌‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.


Similar News