తెలంగాణ షట్లర్ జ్ఞానదత్తుకు కాంస్యం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన తన్వి

ఆసియా బ్యాడ్మింటన్ అండర్-17, 15 జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత యువ క్రీడాకారిణి తన్వి పత్రి అదిరే ప్రదర్శన కొనసాగుతోంది.

Update: 2024-08-24 19:08 GMT

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ అండర్-17, 15 జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత యువ క్రీడాకారిణి తన్వి పత్రి అదిరే ప్రదర్శన కొనసాగుతోంది. అండర్-15 గర్ల్స్ సింగిల్స్‌లో మొదటి నుంచి సంచలన ప్రదర్శన చేస్తున్న ఆమె తాజాగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్‌లో తన్వి 21-19, 21-10 తేడాతో థాయిలాండ్‌కు చెందిన కకానిక్‌ను ఓడించింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవ్వగా.. రెండో గేమ్‌లో తన్విదే పూర్తి హవా. 31 నిమిషాల్లోనే వరుసగా రెండు గేమ్‌లను నెగ్గింది. ఫైనల్‌లో తన్వి.. వియత్నం షట్లర్ న్గుయెన్‌తో తలపడనుంది. అక్కడ ఓడినా కనీసం రజతం దక్కనుంది. కానీ, తన్వి జోరు చూస్తుంటే స్వర్ణం గెలిచేలా కనిపిస్తున్నది. మరోవైపు, అండర్-17 బాయ్స్ సింగిల్స్ కేటగిరీలో తెలంగాణ యువ క్రీడాకారుడు జ్ఞానదత్తు కాంస్యం సాధించాడు. సెమీస్‌లో అతను 9-21, 21-13, 21-13 తేడాతో ఇండోనేషియాకు చెందిన రాధిత్య వర్దన్ చేతిలో పోరాడి ఓడి బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టాడు. 


Similar News