అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు సూర్య డౌటే!

Update: 2023-12-22 16:35 GMT

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు వెళ్లడంపై అనుమానాలు నెలకొన్నాయి. గాయం నుంచి అతను ఇంకా కోలుకోకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్య నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ 1-1తో ముగిసింది. మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య చీలమండలానికి గాయయైంది. వన్డే, టెస్టు జట్టులో అతను లేకపోవడంతో స్వదేశానికి తిరిగివచ్చాడు. స్కానింగ్‌లో చీలమండలం గ్రేడ్ 2 గాయంగా వైద్యులు గుర్తించారు. దాంతో దాదాపు ఏడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని అతనికి వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు అతను దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ‘అతను కోలుకోవడానికి సమయం పడుతుంది. రిహాబిలిటేషన్ కోసం అతను నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అఫ్గాన్‌ సిరీస్‌ అతను ఆడలేడు.’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి తొలి వారం నాటికి అతను ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా.. జనవరిలో మూడు టీ20ల సిరీస్ కోసం అఫ్గాన్‌లో పర్యటించనుంది. జనవరి 11న తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్‌-2024కు ముందు భారత్ ఆడబోయే చివరి పొట్టి ఫార్మాట్ సిరీస్ ఇదే. కాబట్టి, సూర్య దూరమవడం జట్టుకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.


Similar News