స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్య.. సర్జరీ కోసం జర్మనీకి పయనం!

ఈ నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

Update: 2024-01-08 16:22 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్‌ను గాయాలు వేధిస్తున్నాయి. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో అతను చీలమండలం గాయానికి గురైన విషయం తెలిసిందే. అతను మరో సమస్యతో కూడా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. సూర్యకుమార్ స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. స్పోర్ట్స్ హెర్నియా అంటే పొత్తి కడుపు లేదా గజ్జల్లో కండరాలకు గాయమవడం. ప్రస్తుతం సూర్య బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను ఈ నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. త్వరలోనే సూర్య సర్జరీ కోసం జర్మనీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 2022లో భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలోనే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత సూర్య ట్రైనింగ్ మొదలుపెట్టడానికి దాదాపు 8-9 వారాల సమయం పడుతుంది. ఈ లెక్కన అతను రంజీ ట్రోఫీకి పూర్తిగా దూరం కానున్నాడు. మార్చి నెలాఖరులో ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిర్ణీత సమయంలోగా సూర్య ఫిట్‌నెస్ సాధించకపోతే ఐపీఎల్ మొత్తానికి కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది.


Tags:    

Similar News