ముంబై: ఈ నెల 21న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. చైర్మన్ రోజర్ బిన్నీ నేతృత్వంలో వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ మీటింగ్‌లో భారత క్రికెట్‌కు సంబంధించి ఎజెండాలోని 12 పాయింట్లపై చర్చించనున్నారు. వీటిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రక్టుల అంశం ఒకటి. ఆటగాళ్ల వార్షిక వేతనాలకు సంబంధించిన ఈ కాంట్రాక్టుల్లో పలువురు ప్లేయర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించగా, కొందరికి డిమోషన్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం.. టెస్టు స్పెషలిస్టులు అజింక్యా రహానే, ఇషాంత్ శర్మను వార్షిక సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తొలగించనుంది. మరోవైపు, సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్‌తోపాటు టీ20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యాకూ ప్రమోషన్ ఇవ్వనుంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల విభాగంలో ప్రస్తుతం గ్రేడ్ ఏలో ఉన్న హార్దిక్.. టీ20 జట్టుకు ఫుల్ టైం కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోనున్న నేపథ్యంలో అతను గ్రేడ్ ఏ+కి వెళ్లే అవకాశం ఉంది. గ్రేడ్ ఏలో ఉన్న రహానే, స్పీడ్‌స్టర్ ఇషాంత్‌తోపాటు గ్రేడ్ బీలో ఉన్న వృద్ధిమాన్ సాహాకు డిమోషన్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది.
'ఏ+' లోకి కేఎల్ రాహుల్ !
''సూర్య గ్రేడ్ సీలో ఉన్నాడు. ఏడాదిగా అతను కనబరుస్తున్న ప్రదర్శనతో గ్రేడ్ ఏలోకి కాకపోయినా కనీసం గ్రేడ్ బీలో కైనా ప్రమోషన్ పొందుతాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో నం.1 స్థానంలో ఉన్న సూర్య.. వన్డేల్లోనూ పోటీలో ఉన్నాడు'' అని బీసీసీఐకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు, యువ ఓపెనర్ శుభమన్ గిల్ సైతం సీ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్‌లోకి ప్రమోషన్ పొందనున్నాడు. బంగ్లాతో వన్డేలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ వార్షిక కాంట్రాక్టుల జాబితాలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. వీరేకాకుండా, ఓపెనర్ కేఎల్ రాహుల్ ఏ+ గ్రేడ్‌కు దూసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. రోహిత్ లేనప్పుడు వన్డే కెప్టెన్‌గా ఎక్కువగా రాహులే బాధ్యతలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ప్రస్తుత బీసీసీఐ కాంట్రాక్టులు
ఏ+ గ్రేడ్(రూ.7 కోట్లు) : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా
ఏ గ్రేడ్ (రూ. 5 కోట్లు): అశ్విన్, జడేజా, పుజారా, రహానే, ధావన్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా
బీ గ్రేడ్ (రూ. 3 కోట్లు): వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ థాకూర్, మయాంక్ అగర్వాల్
గ్రేడ్ సీ (రూ. కోటి): కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, శుభమన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, భువీ, సూర్యకుమార్