MVA హై పెర్ఫార్మెన్స్ అథ్లెటిక్స్ మీట్‌లో శ్రీశంకర్‌కు స్వర్ణం..

భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ ఎంవీఏ హై పెర్ఫామెన్స్ అథ్లెటిక్స్ మీట్-1లో స్వర్ణ పతకం సాధించాడు.

Update: 2023-05-01 14:47 GMT

న్యూఢిల్లీ: భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ ఎంవీఏ హై పెర్ఫామెన్స్ అథ్లెటిక్స్ మీట్-1లో స్వర్ణ పతకం సాధించాడు. యూఎస్ఏలోని చులా విస్టాలో జరిగిన ఈ పోటీల్లో శ్రీశంకర్ 8.29 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో శ్రీశంకర్‌కు ఇది రెండో ఈవెంట్. 24 ఏళ్ల ఈ అథ్లెట్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. గతేడాది 8.36తో పోలిస్తే ఈ ఏడాది 0.07 మీటర్ల దూరం అభివృద్ధి సాధించాడు.

చైనాకు చెందిన మా వీడాంగ్ 7.99 మీటర్లతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అతని సహచరుడు హుఫెంగ్ హువాంగ్ 7.61 మీటర్లతో కాంస్యం సాధించాడు. ఈ ఏడాది ఆగస్టులో బుడాపెస్ట్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరగనుంది. దానికి క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ 8.25 మీటర్లు. శ్రీశంకర్ దాన్ని సాధించాడు. కానీ టెయిల్‌విండ్‌లు అనుమతించదగిన పరిమితుల కంటే ఎక్కువగా ఉన్నందున పరిగణనలోకి తీసుకోలేదు. అనుమతించదగిన గాలి వేగం +2 మీటర్ పర్ సెకన్. కానీ శ్రీశంకర్ గాలి వేగం 3.1 మీటర్ పర్ సెకన్‌గా నమోదైంది. ఏప్రిల్ నెల ఆరంభంలో బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిలో శ్రీశంకర్ 7.94 మీటర్లు దూకాడు.

Tags:    

Similar News