టీ20ల్లో స్పెయిన్ చరిత్ర.. వరుస విజయాల్లో వరల్డ్ రికార్డు

టీ20ల్లో స్పెయిన్ పురుషుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది.

Update: 2024-08-26 14:41 GMT

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌లో స్పెయిన్ జట్టు గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ, ఆ పసికూన టీ20ల్లో చరిత్ర సృష్టించింది. పొట్టి ఫార్మాట్‌లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా వరల్డ్ రికార్డు నెలకొల్పింది. టీ20 వరల్డ్ కప్ యూరోప్ సబ్ రీజినల్ క్వాలిఫయర్ సిలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో గ్రీస్‌ను ఓడించడంతో స్పెయిన్ ఈ ఘనత సాధించింది.

గ్రీస్‌పై స్పెయిన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన గ్రీస్ 96/9 స్కోరు చేయగా.. స్పెయిన్ 13 ఓవర్లలోనే 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్పెయిన్‌కు ఇది 14 విజయం. ఈ గెలుపుతో ఇంతకుముందు మలేషియా(13 విజయాలు) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. గర్వించదగ్గ రికార్డు నెలకొల్పామని, ఇది తమ జట్టుకు నిజంగా ప్రత్యేకమైందని స్పెయిన్ హెడ్ కోచ్ కోరీ రట్జర్స్ తెలిపాడు.

చివరిసారిగా 2022 నవంబర్‌లో ఇటలీపై ఓడిపోయిన స్పెయిన్.. ఆ తర్వాత విజయయాత్ర కొనసాగిస్తోంది. గ్రీస్‌పై గెలుపుతో స్పెయిన్ ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ గెలిస్తే యూరోప్ రీజినల్ క్వాలిఫయర్ ఫైనల్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. టీ20ల్లో వరుస విజయాల ఆల్‌టైం రికార్డు థాయిలాండ్ మహిళల జట్టు(17 విజయాలు) పేరిట ఉంది. 


Similar News