SL vs NZ 2nd Test : చెలరేగిన శ్రీలంక స్పిన్నర్లు జయసూర్య, నిషాన్.. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ దిశగా

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక విజయం దిశగా దూసుకెళ్తున్నది.

Update: 2024-09-28 12:59 GMT

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక విజయం దిశగా దూసుకెళ్తున్నది. మరో 5 వికెట్లు తీస్తే ఇన్నింగ్స్ విజయం సాధించడంతోపాటు రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయనుంది. గల్లె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి రెండు రోజులు బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడితే.. శనివారం బౌలర్లు చెలరేగారు. స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య ఏడు వికెట్లు, నిషాన్ పీరిస్ ఆరు వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించారు. మూడో రోజు కివీస్ 13 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.

మొదట ఓవర్‌నైట్ స్కోరు 22/2తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 88 రన్స్‌కే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 66 పరుగులే జోడించి 8 వికెట్లు కోల్పోయింది. సాంట్నర్(29) టాప్ స్కోరరంటే కివీస్ వైఫల్యాన్ని అర్థం చేసుకోవచ్చు. స్పిన్నర్ జయసూర్య ఆరు వికెట్లతో ప్రత్యర్థిని కూల్చేశాడు. అతనికితోడు నిషాన్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 602/5 స్కోరు చేసిన శ్రీలంక.. ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కట్టడి చేసి 514 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. దీంతో కివీస్‌ను ఫాలో ఆన్ ఆడించింది.

మూడో రోజే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ బ్యాటుతో మెరుగైనా కీలక వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 199/5 స్కోరుతో నిలిచింది. కాన్వే(61) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేన్ విలియమ్సన్(46) పర్వాలేదనిపించాడు. టామ్ బ్లండెల్(47 బ్యాటింగ్), గ్లెన్ ఫిలిప్స్(32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కివీస్ ఇంకా 315 పరుగులు వెనుకబడి ఉండగా.. మరో ఐదు వికెట్లు పడగొడితే శ్రీలంకదే గెలుపు. ఆదివారమే శ్రీలంక విజయతీరాలకు చేరే అవకాశం ఉంది. 

Tags:    

Similar News