లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’గా గిల్
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’గా నియమితుడయ్యాడు.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) సి.సిబిన్ సోమవారం వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన గిల్ నియామకం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 70 శాతానికిపైగా ఓటింగ్ జరిగేందుకు సహాయపడుతుందని చెప్పారు. ‘ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు గిల్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. గత ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ నమోదైన ప్రాంతాల్లో గిల్ ఓటర్లను చైతన్యం చేయనున్నాడు. తద్వారా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని నమ్ముతున్నాం.’ అని సీఈవో సిబిన్ తెలిపారు. గిల్‌తోపాటు పంజాబీ సింగర్ టార్సెమ్ జస్సర్ కూడా ‘స్టేట్ ఐకాన్’గా నియామకమయ్యారు.
కాగా, గిల్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్నాడు. కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమైన అతను వైజాగ్ టెస్టులో సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. మూడో టెస్టులోనూ రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రనౌట్ రూపంలో పెవిలియన్ చేరి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 42 సగటుతో 252 పరుగులు చేశాడు.