తెలుగమ్మాయి శ్రీవల్లి సంచలనం.. డబుల్స్ టైటిల్ కైవసం
తెలుగమ్మాయి, టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సత్తాచాటింది.
దిశ, స్పోర్ట్స్ : తెలుగమ్మాయి, టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సత్తాచాటింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతున్న ఐటీఎఫ్ ఉమెన్స్-35 ఇండోర్ ఓపెన్‌లో సహచరిణి వైదేహి చౌదరితో కలిసి మహిళల డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో శ్రీవల్లి జోడీ 6-3, 7-5 తేడాతో 4వ సీడ్ యా హ్సుయాన్ లీ(చైనీస్ తైపీ)-సోహ్యున్ పార్క్(కొరియా) జంటను చిత్తు చేసింది. గంటా 15 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన భారత జంట తమ కంటే మెరుగైన ప్రత్యర్థులను వరుస సెట్లలో మట్టికరిపించింది. దీంతో శ్రీవల్లి జోడీ డబుల్స్ విజేతగా నిలువగా.. ఈ జంటకు ఇది మూడో డబుల్స్ టైటిల్. అలాగే, ఈ టోర్నీలో భారత జంట ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం.
సింగిల్స్‌లో కూడా శ్రీవల్లికి ఎదురులేకుండా పోయింది. అదిరే ప్రదర్శనతో తన కంటే మెరుగైన ర్యాంకర్లను మట్టికరిపిస్తున్నది. తాజాగా సెమీస్‌లోనూ అదే జోరు కనబర్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో శ్రీవల్లి 6-3, 6-4 తేడాతో 7వ సీడ్ పొలిన లాట్కెనెకోపై విజయం సాధించింది. 7 ఏస్‌లు సంధించిన శ్రీవల్లి ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఫైనల్‌లో 2వ సీడ్, స్లోవేనియాకు చెందిన దలీలా జకుపోవిక్‌తో తలపడనుంది.