Asia Cup 2023 : ఆసియా కప్‌కు శ్రేయస్ అయ్యర్ డౌటే..!

గాయం కారణంగా టీమ్ ఇండియాకు దూరమైన బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్‌కు కూడా అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు.

Update: 2023-06-25 13:28 GMT

న్యూఢిల్లీ : గాయం కారణంగా టీమ్ ఇండియాకు దూరమైన బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్‌కు కూడా అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. బ్యాక్ పెయిన్‌‌‌తో సతమతమైన అయ్యర్ ఏప్రిల్‌లో లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించేందుకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో చేరాడు. దాంతో ఇటీవల ప్రకటించిన వెస్టిండీస్ సిరీస్‌ సెలెక్షన్‌కు అతను దూరంగా ఉన్నాడు. అయితే, ఐర్లాండ్‌ సిరీస్‌కు లేదా ఆసియా కప్‌కు జట్టులో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ, అతను బ్యాక్ పెయిన్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఎన్‌సీఏ సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘నేషనల్ క్రికెట్ అకాడమీలో అయ్యర్ ఇటీవల బ్యాక్ పెయిన్ కోసం ఇంజెక్షన్ తీసుకున్నాడు.

అతని వెన్ను గాయం ఇంకా ఇబ్బంది పెడుతోంది’ అని పేర్కొన్నాయి. అలాగే, మరో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఆసియా కప్‌‌ బరిలో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. తొడకండరాల గాయంతో ఐపీఎల్-2023 మధ్యలోనే వైదొలిగిన అతను శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే, టోర్నీ వరకూ అతను పూర్తిగా ఫిట్‌నెస్ సాధించే అవకాశం లేదని తెలుస్తోంది. మరి, ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ నిరూపించుకుంటారో లేదో చూడాలి.


Similar News