షమీ వచ్చేస్తున్నాడు.. ఆ మ్యాచ్‌తోనే రీఎంట్రీ
గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దాదాపు ఏడాది తర్వాత అతను కాంపిటేటివ్ క్రికెట్ ఆడబోతున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి మధ్యప్రదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో అతను బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మంగళవారం షమీ పునరాగమనాన్ని ధ్రువీకరించింది.
షమీ చివరిసారిగా గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత గాయం, సర్జరీ కారణంగా దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే కోలుకున్నాడు. అయితే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి జట్టును ప్రకటించే నాటికి అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ఆసిస్‌కు వెళ్లే జట్టులో అతనికి చోటు దక్కలేదు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించిన షమీకి తాజాగా నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) క్రికెట్ ఆడేందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే నేడు మధ్యప్రదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో షమీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. రంజీ ట్రోఫీలో నిరూపించుకుంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో అతన్ని భారత జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.