శ్రీలంక తాత్కాలిక హెడ్ కోచ్‌గా జయసూర్య

శ్రీలంక క్రికెట్ దిగ్గజం జనత్ జయసూర్య శ్రీలంక జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు.

Update: 2024-07-08 12:31 GMT

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక క్రికెట్ దిగ్గజం జనత్ జయసూర్య శ్రీలంక జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) సోమవారం ప్రకటించింది. హెడ్ కోచ్‌గా ఉన్న క్రిస్ సిల్వర్‌‌వుడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగిసింది. దీంతో ప్రస్తుతం శ్రీలంక క్రికెట్‌కు పూర్తి స్థాయి క్రికెట్ కన్సల్టెంట్‌గా ఉన్న జయసూర్యకు ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్‌‌లో ఇంగ్లాండ్ పర్యటన వరకు అతను ఆ పదవిలో కొనసాగనున్నాడు.

ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ఒక్క మ్యాచ్ మాత్రమే నెగ్గి గ్రూపు దశలోనే ఇంటిదారిపట్టింది. ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టుపై బోర్డు దృష్టి సారించింది. జయసూర్య అనుభవం జాతీయ జట్టుకు ఉపయోగపడుతుందని శ్రీలంక బోర్డు ఆశిస్తున్నది. సొంతగడ్డపై భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో జయసూర్య బాధ్యతలు చేపట్టనున్నాడు. తొలి సిరీస్‌లోనే అతనికి టఫ్ చాలెంజ్ ఎదురుకానుంది. ఈ నెల 27 నుంచి ఆగస్టు 7 వరకు మూడు టీ20లు, మూడు వన్డేల కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.

కాగా, 1989-2011 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో జయసూర్య శ్రీలంక తరపున 586 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 21, 032 పరుగులు చేశాడు. అందులో 42 సెంచరీలు, 103 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 440 వికెట్లు కూడా పడగొట్టాడు. 


Similar News