పంత్‌కు ఒక్క కాలు చాలు.. టీ20 వరల్డ్ కప్‌కు తీసుకోండి : సునీల్ గవాస్కర్
రిషబ్ పంత్ గేమ్ ఛేంజర్ అని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కితాబిచ్చాడు.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. ఐపీఎల్ నాటికి ఫూర్తి ఫిట్‌నెస్ సాధించి.. తిరిగి మైదానంలో అడుగుపెడతాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, టీ20 వరల్డ్ కప్‌కు కూడా రోజులు దగ్గరపడుతుంది. భారత జట్టులో చోటు కోసం పోటీ ఎక్కువగానే ఉంది. వికెట్ కీపర్ స్థానం కోసం కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ పోటీపడుతున్నారు. ప్రపంచకప్ నాటికి పంత్ కోలుకుంటే అతనికే ఎక్కువ అవకాశాలు ఉంటాయని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాజాగా స్టార్ స్పోర్ట్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ పంత్‌కు మద్దతు పలికాడు. రిషబ్ గేమ్ ఛేంజర్ అని కితాబిచ్చాడు. ‘కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా రాణిస్తున్నాడు. కానీ, నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. రిషబ్ పంత్ ఒక్క కాలు ఫిట్‌గా ఉన్నా సరే అతన్ని ఎంపిక చేయాలి. ఎందుకంటే.. ప్రతి ఫార్మాట్‌లో అతను గేమ్ ఛేంజర్. నేను సెలెక్టర్ అయితే మొదట అతని పేరునే తీసుకుంటాను.’ అని చెప్పాడు. పంత్ అందుబాటులో లేకపోతేనే రాహుల్‌ను తీసుకోవాలని సూచించాడు. రాహుల్ జట్టులో సమతూకం తీసుకొస్తాడని, అతన్ని ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దింపొచ్చని చెప్పుకొచ్చాడు.