రామ్ బాబుకు కాంస్యం.. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ మార్క్ సాధించిన భారత అథ్లెట్
డుడిన్స్కా 50 మీట్‌లో భారత అథ్లెట్, రేస్ వాకర్ రామ్ బాబు శనివారం పురుషుల 20 కిలో మీటర్ల రేసులో కాంస్య పతకం సాధించాడు.
దిశ, స్పోర్ట్స్ : స్లోవేకియాలో జరిగిన డుడిన్స్కా 50 మీట్‌లో భారత అథ్లెట్, రేస్ వాకర్ రామ్ బాబు శనివారం పురుషుల 20 కిలో మీటర్ల రేసులో కాంస్య పతకం సాధించాడు. వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేసిన రామ్ బాబు 1:20:00 సెకన్లలో లక్ష్యాన్ని ముగించి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో ఈ ఈవెంట్ చరిత్రలో కాంస్య పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డుకెక్కాడు. అంతేకాకుండా, పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ అర్హత ప్రమాణాలను సాధించాడు. ఒలింపిక్ క్వాలిఫికేషన్ మార్క్ 1:20:10 సెకన్లుగా ఉండగా.. అర్హత ప్రమాణాలను రామ్ బాబు అధిగమించాడు. దీంతో ఒలింపిక్ క్వాలిఫికేషన్ మార్క్ సాధించిన ఏడో భారత రేస్ వాకర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఆకాశ్‌దీప్ సింగ్, వికాశ్ సింగ్, పరమ్‌జీత్ బిష్ట్, సురాజ్ పన్వాల్, సెర్విన్ సెబాస్టియన్, అర్ష్‌ప్రీత్ సింగ్ ఆ జాబితాలో ఉన్నారు. అయితే, పురుషుల 20 కి.మీ రేసు వాక్ ఈవెంట్‌కు భారత్ నుంచి గరిష్టంగా ముగ్గురు అథ్లెట్లు మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చు. అథ్లెట్ల ఎంపిక అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధారపడి ఉన్నది. జూన్‌లో తుది ఎంపిక ఉంటుందని చీఫ్ అథ్లెటిక్స్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్ తెలిపారు.