ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లకు అదొక్కటే దారి.. వేటుపై ద్రవిడ్ రియాక్షన్
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారన్న కారణంతో టీమ్ ఇండియా యువ బ్యాటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తాజాగా స్పందించాడు. ఐదో టెస్టు అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘నేడు కాంట్రాక్ట్‌లను నిర్ణయించను. దాని గురించి చర్చించను. కాంట్రాక్ట్‌కు ఎలా ఎంపిక చేస్తారో కూడా నాకు తెలియదు.’ అని చెప్పాడు. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్, అయ్యర్‌లకు ద్రవిడ్ కీలక సూచనలు చేశాడు. ఫిట్‌గా ఉంటూ క్రికెట్ ఆడుతూనే ఉండాలని సూచించాడు. ‘వారిద్దరూ ఫిట్‌గా ఉంటూ క్రికెట్ ఆడటం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తారని ఆశిస్తున్నా. ఆటగాళ్లు కాంట్రాక్ట్ పొందనప్పటికీ జాతీయ జట్టు తరపున ఆడొచ్చు.’ అని ద్రవిడ్ తెలిపాడు.