వన్డే వరల్డ్ కప్ 2023కు సౌతాఫ్రికా క్వాలిఫై..
వన్డే వరల్ కప్ టోర్నీకి సౌతాఫ్రికా జట్టు నేరుగా అర్హత సాధించింది.
లండన్: వన్డే వరల్ కప్ టోర్నీకి సౌతాఫ్రికా జట్టు నేరుగా అర్హత సాధించింది. ఐర్లాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డే ఫలితం లేకుండా ముగియడంతో సౌతాఫ్రికాకు ఈ అవకాశం దక్కింది. ర్యాంకింగ్స్ పట్టికలో 11వ స్థానంలో ఉన్న ఐర్లాండ్ జట్టు పైకి ఎగబాకాలంటే బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తప్పక విజయం సాధించాల్సి ఉండింది. అయితే ఇంగ్లీష్ కౌంటీ ఎసెక్స్ హెడ్ క్వార్టర్స్ చెమ్స్‌ఫోర్డ్‌లో జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తర్వాత జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ ఐర్లాండ్ జట్టు గెలిచినప్పటికీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ (డబ్ల్యూసీఎస్ఎల్)లో ఎనిమిదో స్థానంలో ఉన్న సౌతాఫ్రికాను అధిగమించలేదు.
ఇక ఐర్లాండ్ జట్టు జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు జింబాబ్వేలో జరగనున్న క్వాలిఫైయింట్ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో మాజీ చాంపియన్స్ వెస్టిండీస్, శ్రీలంక జట్టు కూడా బరిలోకి దిగనున్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాదేశ్ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్ జట్టు 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. అయితే స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు బ్యాడ్ లైడ్, వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. తర్వాత కనీసం 20 ఓవర్లయినా ఆడించి ఫలితం తేల్చాలని భావించారు. కానీ మైదానం అంతా చిత్తడిగా ఉండటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. వన్డే వరల్డ్ కప్ ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.