విరాట్ తల్లి ఆరోగ్యంపై వదంతులు.. స్పందించిన కోహ్లీ సోదరుడు

ఇంగ్లాండ్ తో భారత్ టెస్టు సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు. వ్యక్తిగత కారణాల వల్ల రెండుటెస్టు మ్యాచ్ ల నుంచి తప్పుకున్నాడు

Update: 2024-01-31 16:12 GMT

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ తో భారత్ టెస్టు సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు. వ్యక్తిగత కారణాల వల్ల రెండుటెస్టు మ్యాచ్ ల నుంచి తప్పుకున్నాడు. దీంతో విరాట్ తల్లి సరోజ్ ఆరోగ్యం బాలేదని.. సోషల్ మీడియాలో రెండ్రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై కోహ్లీ సోదరుడు వికాస్ స్పందించాడు. తమ తల్లి ఫిట్ అండ్ ఫైన్ అని స్పష్టం చేశారు. అసత్యప్రచారాలు వ్యాప్తి చేయవద్దని నెటిజన్లను కోరారు. కచ్చితమైన సమాచారం మాత్రమే పంచుకోవాలని హితవు పలికారు.

ఇన్ స్టాగ్రాంలో వికాస్ స్పందిస్తూ..“అందరికీ నమస్కారం.. మా అమ్మ ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. మా అమ్మ పూర్తిగా ఫిట్ అండ్ ఫైన్. ఆమె ఆరోగ్యంపై అసత్య వార్తలు ప్రచారం చేయవద్దని అభ్యర్థిస్తున్నారు. సరైన సమాచారం లేకుండా మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి.” అని రాసుకొచ్చారు.

కింగ్ కోహ్లీ.. తన తల్లి అనారోగ్యం కారణంగా తొలి రెండుటెస్టుల నుంచి విరామం తీసుకున్నట్లు పుకార్లు వ్యాపించాయి. కాగా.. వ్యక్తిగత కారణాలతోనే తొలి రెండుటెస్టుల నుంచి కోహ్లీ వైదొలిగినట్లు బీసీసీఐ ప్రకటించింది. కోహ్లీ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని.. ఊహాగానాలు మానుకోవాలని అభిమానులను అభ్యర్థించింది బీసీసీఐ. మరోవైపు ఉప్పల్ లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్ పై ఇంగ్లాండ్ గెలిచింది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా.. రెండో టెస్టు జరగనుంది. ఇప్పటికే కోహ్లీ అందుబాటులో లేకపోగా.. గాయం కారణంగా జడేజా, కేఎల్ రాహుల్ రెండో టెస్టుకు దూరమయ్యారు.


Similar News