కష్టాలు వచ్చినా ఆ పని మాత్రం చేయను : మను బాకర్
తన జీవితాన్ని ఎవరితోనూ మార్చుకోవడం తనకు ఇష్టం లేదని భారత స్టార్ షూటర్ మను బాకర్ తెలిపింది.
దిశ, స్పోర్ట్స్ : తన జీవితాన్ని ఎవరితోనూ మార్చుకోవడం తనకు ఇష్టం లేదని భారత స్టార్ షూటర్, పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను బాకర్ తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనును.. మరొక అథ్లెట్‌తో ఒక రోజు మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా? అని అడిగారు. దీనికి మను స్పందిస్తూ.. ఆ పని ఎప్పుడూ చేయనని తేల్చిచెప్పింది. ‘నిజాయతీగా చెప్పాలంటే నా జీవితాన్ని ఎవరితోనూ మార్చుకోవడం ఇష్టం ఉండదు. గడ్డుకాలం వచ్చినా ఆ పని మాత్రం చేయను.’ అని చెప్పింది.
షూటింగ్ కాకుండా ఇంకా ఏదైనా చేయాలనుకుంటున్నారా? అని అడగ్గా.. ‘నా జీవితమే షూటింగే. దేశానికి ఇంకా పతకాలు అందించాలి. దుస్తులు ధరించడం, ఇతర వస్తువులు కూడా ఆనందిస్తాను. కానీ, షూటింగ్ తర్వాతే అవన్నీ.’ అని మను చెప్పుకొచ్చింది. అలాగే, తాను కోపాన్ని ఎలా నియంత్రిస్తుందో వివరించింది. ‘నాకు కూడా కోపం వస్తుంది. కానీ, కోపాన్ని సానుకూలంగా మార్చుకోవడం నేర్చుకున్నాను. ఓ క్రీడాకారిణిగా నాకు అది చాలా ముఖ్యం.’ అని తెలిపింది.