అశ్విన్‌కు చిరాకు తెప్పించిన ట్విట్టర్.. ఎలన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ..

Update: 2023-03-15 10:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. క్రికెట్ గురించి తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటాడు. అలాంటి అశ్విన్‌కు ట్విట్టర్ తాజాగా తీసుకొచ్చిన సెక్యూరిటీ అప్‌డేట్ చిరాకు తెప్పించింది. ఈ నేపథ్యంలో అశ్విన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన ట్వీట్టర్ అకౌంట్‌లో ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్‌ను అశ్విన్ ట్యాగ్ చేయడం గమనార్హం. ట్విట్టర్‌లో అశ్విన్‌కు 10.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వాళ్లందరూ అశ్విన్ చేసే ట్వీట్లను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉంటారు.

అయితే తాజాగా ట్విట్టర్ యాజమాన్యం కొత్త తరహా సెక్యూరిటీ ఫీచర్ తీసుకొచ్చింది. దీని ప్రకారం.. బ్లూ టిక్ సబ్‌స్క్రయిబ్ చేసుకుని యూజర్లు టెక్స్ట్ మెసేజ్ ఫీచర్ వాడుకోవడం కుదరదు. కేవలం పెయిడ్ సబ్‌స్క్రయిబర్లకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఈ క్రమంలోనే టెక్స్ట్ మెసేజ్‌కు సంబంధించిన 'టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్'ను డిసేబుల్ చేసుకోవాలని ట్విట్టర్ నుంచి నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇలా టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌‌ను డిసేబుల్ చేయకపోతే ఆయా ఖాతాల యాక్సెస్ పోతుందని ట్విట్టర్ హెచ్చరిస్తోంది. టెక్స్ట్‌ మెసేజ్ 2ఎఫ్ఏను ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు మాత్రమే అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు తనకు కూడా వచ్చినట్లు అశ్విన్ వెల్లడించాడు. 'మార్చి 19 లోపు నా ట్విట్టర్ ఖాతను సెక్యూర్ ఎలా చేసుకోవాలి..? ఇది చేసుకోవాలంటూ నాకు తెగ పాప్ అప్ వస్తున్నాయి. కానీ, ఎన్నిసార్లు క్లిక్ చేసినా క్లారిటీ రావడం లేదు. ఎలన్ మస్క్.. దీని కోసం ఏం చేయాలో చెప్తే అది చేసుకుంటా' అని అశ్విన్ సూటిగా మస్క్‌ను ప్రశ్నించాడు. ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్ తమకు కూడా ఇదే సమస్య వచ్చిందని అంటున్నారు.

Tags:    

Similar News