స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో సెమీస్‌కు నిఖత్
స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో భారత స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ సెమీస్‌కు దూసుకెళ్లింది.
దిశ, స్పోర్ట్స్ : బల్గేరియాలో జరుగుతున్న స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో భారత స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ సెమీస్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన 50 కేజీల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ 5-0 తేడాతో ఫ్రాన్స్ బాక్సర్ ల్ఖాదిరి వాసిలాను చిత్తుగా ఓడించింది. మ్యాచ్ మొత్తం ఆధిపత్యం ప్రదర్శించిన నిఖత్ ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. ఫ్రాన్స్ బాక్సర్‌ను పుంజుకోకుండా కచ్చితమైన పంచ్‌లు విసిరిన ఆమె మ్యాచ్‌ను ఏకపక్షంగా గెలుచుకుంది. శనివారం జరిగే సెమీస్‌లో బల్గేరియా బాక్సర్ జ్లాటిస్లావా చుకనోవాతో నిఖత్ తలపడనుంది. మరో భారత బాక్సర్ అరుంధతి చౌదరి 66 కేజీల విభాగంలో సెమీస్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో అరుంధతి 5-0 తేడాతో సెర్బియాకు చెందిన మాటోవిక్ మిలెనాపై విజయం సాధించింది. మరో భారత బాక్సర్ సాక్షి క్వార్టర్స్‌లో నిష్ర్కమించింది. ఉజ్బెకిస్తాన్ బాక్సర్ మమజోనోవా ఖుమోరబోను చేతిలో 3-2 తేడాతో పోరాడి ఓడింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో అమిత్ పంఘల్(51 కేజీలు), లలిత్(54 కేజీలు), సచిన్(57 కేజీలు), రజత్(67 కేజీలు),ఆకాశ్(71 కేజీలు), దీపక్(75 కేజీలు), అభిమన్యు లౌరా(80 కేజీలు) తలపడనున్నారు.