కివీస్ స్టార్ పేసర్ సంచలన నిర్ణయం

న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ టిమ్ సౌథీ శుక్రవారం కీలక ప్రకటన చేశాడు.

Update: 2024-11-15 10:16 GMT

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ టిమ్ సౌథీ శుక్రవారం కీలక ప్రకటన చేశాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు వెల్లడించాడు. డిసెంబర్‌లో కివీస్, ఇంగ్లాండ్ మధ్య మూడు టెస్టుల‌కు న్యూజిలాండ్ ఆతిథ్యమిస్తున్నది. ఆ సిరీస్‌లో సౌథీ తన సొంత మైదానమైన హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరిగే మూడో టెస్టే తనకు చివరిదని తెలిపాడు.

‘న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించి నేను ఎదగాలని కలలు కన్నాను. బ్యాక్‌క్యాప్స్‌కు 18 ఏళ్లకు ఆడటం నాకు అతిపెద్ద గౌరవం, ప్రత్యేకం. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. కానీ, గేమ్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. టెస్టు క్రికెట్‌‌కు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. నేను కెరీర్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్‌పైనే చివరి మ్యాచ్ ఆడబోతున్నా. నాకు చాలా ప్రత్యేకమైన మూడు మైదానాల్లో బ్యాక్‌క్యాప్స్‌తో నా సమయాన్ని ముగించడం సరైన మార్గం.’ అని సౌథీ చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా సౌథీ నిర్ణయాన్ని ధ్రువీకరించింది. అయితే, వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌‌ ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత సాధిస్తే దానికి అందుబాటులో ఉంటాడని పేర్కొంది. కాగా, 2008లో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన సౌథీ 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కివీస్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 104 టెస్టుల్లో 385 వికెట్లు పడగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 770 వికెట్లతో సౌథీ కివీస్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు కలిగి ఉన్నాడు. 

Tags:    

Similar News