మానవత్వం చాటుకున్న బంగ్లా క్రికెటర్ రహీమ్

పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించడంలో రహీమ్ కీలక పాత్ర పోషించాడు.

Update: 2024-08-25 14:09 GMT

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ మానవత్వం చాటుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రైజ్‌మనీని బంగ్లాదేశ్‌లోని వరద బాధితులకు విరాళంగా ఇచ్చాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించడంలో రహీమ్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రహీమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అందుకుగానూ 300,000 పీకేఆర్(దాదాపు రూ.91 వేలు) అందుకున్నాడు. ఆ మొత్తాన్ని రహీమ్ బంగ్లాదేశ్‌లో వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. మ్యాచ్ అనంతరం రహీమ్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రైజ్‌మనీని బంగ్లాదేశ్‌లో వరదల ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా. అలాగే, ఈ పరిస్థితుల్లో నా దేశానికి విరాళాలు ఇవ్వాలని, సహాయం చేయాలని కోరుతున్నా.’ అని చెప్పాడు. బంగ్లాదేశ్‌లో భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా దాదాపు 50 లక్షల మంది వరదల్లో చిక్కుకుపోయారు.


Similar News