దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ విచిత్రంగా ఔట్ అయ్యాడు. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ముష్పీకర్.. ‘అబ్‌స్ట్రాకింగ్ ది ఫీల్డ్’గా ఔట్ అయిన తొలి బంగ్లా బ్యాటర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్ కైల్ జెమీసన్ వేసిన 40వ ఓవర్లో.. నాలుగో బంతిని డిఫెన్స్ ఆడబోగా అది కాస్తా వికెట్ల మీదకు రావడంతో దానిని చేతితో (హ్యాండిల్ ది బాల్) అడ్డుకున్నందుకు ఔట్ అయ్యాడు. క్రికెట్‌లో ఉన్న 11 రకాల ఔట్‌లలో ఇది ఒకటి.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఇలా ఔట్ అయినవారు 15 మంది ఉన్నారు. రమీజ్‌రాజా (పాకిస్తాన్), మోహిందర్ అమర్‌నాథ్ (ఇండియా), ఇంజమామ్ ఉల్ హక్ (పాక్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) వంటి వాళ్లు కూడా ఇలా ఔట్ అయిన జాబితాలో ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి ఈ విధంగా ఔట్ అయిన తొలి బ్యాటర్ మాత్రం ముష్ఫీకర్ రహీమ్ మాత్రమే. టెస్టులలో ఇలా ఔట్ అయింది మాత్రం ముష్ఫీకర్ రెండోవాడు. అంతకుముందు లియోనార్డ్ హటన్ (ఇంగ్లండ్) 1951లో ఇలా ఔట్ అయినవారిలో తొలి బ్యాటర్. ఆ తర్వాత ముష్పీకర్ మాత్రమే. మిగతావాళ్లు వన్డే, టీ20లలో ఇలా ఔటయ్యారు.
'అబ్‌స్ట్రాకింగ్ ది ఫీల్డ్'.. అంటే?
క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనలలోని 37వ లా ప్రకారం.. ఎవరైనా ఒక బ్యాటర్ బంతిని ఆడే సమయంలో అతడు దానిని చేతితో అడ్డుకుంటే అది అబ్‌స్ట్రాకింగ్ ది ఫీల్డ్ కిందకే వస్తుంది. బ్యాటర్‌కు ఇంజ్యూరీ అయితే తప్ప అతడు/ఆమె బంతి డెడ్ అయ్యేదాకా దానిని తాకరాదు. అంతేగాక ఒక బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా ఫీల్డర్‌ను క్యాచ్ పట్టేప్పుడు అంతరాయం కలిగించినా ఈ నిబంధనే వర్తిస్తుంది. తాజాగా ముష్ఫీకర్ ఔట్ అయింది తొలి నిబంధన ఉల్లంఘన కిందే..