Pak vs Ban : చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. టెస్టుల్లో పాక్‌పై తొలి విజయం

పాక్ గడ్డపై బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో పాక్‌ను తొలిసారిగా ఓడించింది.

Update: 2024-08-25 11:53 GMT

దిశ, స్పోర్ట్స్ : పాక్ గడ్డపై బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో పాక్‌ను తొలిసారిగా ఓడించింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆదివారం పాకిస్తాన్‌పై 10 వికెట్ల తేడాతో నెగ్గి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా, సొంతగడ్డపై టెస్టుల్లో పాక్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా కూడా రికార్డు నెలకొల్పింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 448/6 స్కోర్ వద్ద డిక్లేర్డ్ ఇవ్వగా.. బంగ్లా 565 పరుగులు చేసి 117 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఇక, రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు తేలిపోయారు. ఓవర్ నైట్ స్కోరు 23/1‌తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్(4/21), షకీబ్(3/44) బంతితో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. రిజ్వాన్(51) మినహా అందరూ చేతులెత్తేయగా పాక్.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని తీసివేయగా బంగ్లా ముందు 30 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ముష్ఫికర్ రహీమ్(191) భారీ ఇన్నింగ్స్‌తో, మెహిది హసన్ మిరాజ్(77, 5 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో బంగ్లా జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

Tags:    

Similar News