ధోనీ వారసత్వాన్ని గైక్వాడ్ కొనసాగిస్తాడా?.. అతని ముందు ఎన్నో సవాళ్లు
ఐపీఎల్-17 ప్రారంభానికి ఒక్క రోజు ముందు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 ప్రారంభానికి ఒక్క రోజు ముందు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దీంతో సీఎస్కే ఫ్రాంచైజీ జట్టు పగ్గాలను యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అందించింది. గురువారం ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఈ సీజన్‌లో గైక్వాడ్ నాయకత్వంలో చెన్నయ్ బరిలోకి దిగబోతోంది. 42 ఏళ్ల ధోనీ కెప్టెన్‌గా తప్పుకోవాలన్న ఆలోచన ఇప్పటిదేం కాదు. 2022 సీజన్‌కు ముందు అతను సారథిగా వైదొలిగిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బాధ్యతలు చేపట్టగా.. అతని సారథ్యంలో జట్టు వరుస మ్యాచ్‌ల్లో విఫలమైంది. మరోవైపు, కెప్టెన్సీ బాధ్యతలతో ఒత్తిడికి గురైన జడేజా ఆటగాడిగానూ రాణించలేకపోయాడు. దీంతో సీజన్ మధ్యలోనే జడేజా కెప్టెన్‌గా తప్పుకోవడంతో తిరిగి ధోనీనే పగ్గాలు చేపట్టాడు. గత సీజన్‌లో పుంజుకున్న సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు, సీఎస్కే మేనేజ్‌మెంట్ కొత్త కెప్టెన్ కోసం అన్వేషిస్తూనే ఉంది. గత వేలంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌ను తీసుకోవడం కూడా ఆ ప్రణాళికల్లోనూ భాగమేన్న ప్రచారం జరిగింది. అయితే, గత సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన అతను గాయం కారణంగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే, ఈ సీజన్‌కు అతను అందుబాటులో ఉండనని చెప్పడంతో ఫ్రాంచైజీ అతన్ని రిలీజ్ చేసింది. దీంతో ధోనీనే కెప్టెన్‌గా ఉంటాడని ప్రచారం జరగగా.. ఇటీవల ధోనీ ఫేస్‌బుక్ వేదికగా ‘కొత్త సీజన్, కొత్త రోల్ కోసం ఎదురుచూస్తున్నా’ అని పోస్టు చేశాడు. దీంతో అతను కెప్టెన్సీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు వార్తలు రాగా.. అవే నిజమయ్యాయి. దేశవాళీలో, భారత టీ20 జట్టును నడిపించిన అనుభవం ఉన్న గైక్వాడ్ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ధోనీ సారథ్యంలో చెన్నయ్ జట్టు ఐదుసార్లు(2010, 2011, 2018, 2021, 2023) టైటిల్ గెలుచుకుంది.
గైక్వాడ్ ముందు సవాళ్లు
ధోనీ తర్వాత చెన్నయ్‌కి శాశ్వత కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ నియామకమయ్యాడు. సారథిగా అతనికి అనుభవం ఉంది. దేశవాళీలో టీ20, లిస్ట్ ఏ క్రికెట్‌లో మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే, గతేడాది ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో భారత్ గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న గైక్వాడ్‌కు చెన్నయ్‌ను నడిపించడం అంత సులభం కాదు. ధోనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అతనికి సవాల్‌తో కూడుకున్నదే. 2022లో పగ్గాలు చేపట్టిన జడేజా ఒత్తిడి గురై మధ్యలోనే తప్పుకున్న విషయం తెలిసిందే. మరి, గైక్వాడ్ కెప్టెన్సీ భారాన్ని ఏ మేరకు అధిగమిస్తాడో చూడాలి. అలాగే, సీనియర్లు, యువకులతో నిండిన సీఎస్కేను నడపడం కూడా సవాల్‌తో కూడుకున్నదే. అయితే, ఈ సీజన్‌లో గైక్వాడ్‌పై కెప్టెన్సీ భారం పడకుండా ధోనీ వెనుకుండి నడిపించే అవకాశం ఉంది. జట్టు ఎంపికలో, మైదానంలో అతనికి సూచనలు ఇవ్వనున్నాడు. నేడు బెంగళూరుతో జరిగే ఓపెనింగ్ మ్యాచ్ గైక్వాడ్‌కు తొలి పరీక్ష. మరి, కెప్టెన్‌గా గైక్వాడ్ ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. 2020లో చెన్నయ్ తరపున గైక్వాడ్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఓపెనర్‌గా ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన అతను జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 52 మ్యాచ్‌ల్లో 1,797 పరుగులతో సీఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లలో కొనసాగుతున్నాడు.