స్పోర్ట్స్ ఛానల్స్‌కు మరింత గడ్డు కాలం..!

భారతదేశంలో గత రెండు మూడేళ్ల నుంచి స్పోర్ట్స్ ఛానల్స్‌లో క్రీడలు చూసే వాళ్ల కంటే స్ట్రీమింగ్ యాప్స్‌లో చూసే వాళ్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిపోయింది.

Update: 2024-08-21 00:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో గత రెండు మూడేళ్ల నుంచి స్పోర్ట్స్ ఛానల్స్‌లో క్రీడలు చూసే వాళ్ల కంటే స్ట్రీమింగ్ యాప్స్‌లో చూసే వాళ్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిపోయింది. చవకగా లభించే డేటా, ఫ్రీగా లైవ్ మ్యాచ్‌లు ఇచ్చే స్ట్రీమింగ్ యాప్స్ ఉండటంతో స్పోర్ట్స్ ఛానల్స్‌లో క్రీడలను వీక్షించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఈ ట్రెండ్‌ను గమనించే జియో యాజమాన్యం ఐపీఎల్‌కు సంబంధించి కేవలం స్ట్రీమింగ్ హక్కులనే కొని.. శాటిలైట్ హక్కులను స్టార్ గ్రూప్‌కు వదిలేసింది. ఇప్పుడు ఆ స్టార్ గ్రూప్‌ కూడా జియోలో కలిసి పోయింది.ఇక స్కోర్స్ చెక్ చేయడానికి చాలా మంది గూగుల్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. కేవలం మ్యాచ్‌ను సెర్చ్ చేస్తే.. గూగుల్ దానికి సంబంధించిన లైవ్ స్కోర్ స్క్రీన్ మీద ఇస్తుంది. ఇది కూడా టీవీ వ్యూయింగ్‌పై దెబ్బ వేస్తోందని స్టడీలో తెలిసింది. రాబోయే రోజుల్లో టీవీలకు సంబంధించిన హక్కులను కొనడానికి కూడా బ్రాడ్‌కాస్ట్ సంస్థలు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని.. వందలాది స్పోర్ట్స్ ఛానల్స్‌కు గడ్డు పరిస్థితులు తప్పవని అధ్యయనంలో తేలింది.ఉదాహరణకు ఫ్యాన్‌కోడ్ అనే యాప్ తీసుకుంటే..ఈ యాప్ మీ ఊర్లో జరిగే మ్యాచ్‌లను కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. ఈ బ్రాడ్‌కాస్టింగ్ వెనుక బెట్టింగ్ మాఫియా ఉందనే రూమర్లు కూడా ఉన్నాయి.

ప్యారీస్‌లో జరిగిన ఒలింపిక్స్ వ్యూయింగ్ డేటాను నీల్సన్ గ్రూప్ తాజాగా స్టడీ చేసింది. యూఎస్ఏలో సాధారణంగా సాకర్ వరల్డ్ కప్, రగ్బీ మ్యాచెస్, ఒలింపిక్స్ జరిగినప్పుడు సాధారణం కంటే ఎక్కువ వ్యూయర్‌షిప్ ఉంటుంది. టీవీల్లో క్రీడలను లైవ్‌గా చూసే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అయితే ఈ సారి టీవీ వ్యూయింగ్ ట్రెండ్స్ దారుణంగా పడిపోయాయని ఆ రిపోర్టులో తేలింది.యూఎస్ఏలో జూలైలో 3.5 శాతం మంది ఎక్కువగా టీవీ చూడగా.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒలింపిక్స్‌ను చూసిన వారి సంఖ్య 41.4 శాతానికి పెరిగింది. యూఎస్ఏలో కేబుల్ టీవీ, డీటీహెచ్, యాంటెన్నాల ద్వారా చూసిన వారి కంటే స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా క్రీడలను వీక్షించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.ఇండియాలో కూడా జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్‌లు క్రీడల లైవ్ విషయంలో పోటీ పడుతున్నాయి. జియో, డిస్నీ కలిసిపోవడం.. సోనీ, జీ టీవీలు కూడా కలిసిపోవడంతో ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లో ఈ రెండు గ్రూప్‌ల మధ్యే తీవ్రమైన పోటీ నెలకొన్నది. రాబోయే రోజుల్లో శాటిలైట్ హక్కుల కంటే.. స్ట్రీమింగ్ హక్కుల కోసం మరింత పోటీ నెలకొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+లు కూడా స్పోర్ట్స్ కంటెంట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడంతో సాంప్రదాయ టీవీ వ్యూయింగ్ అనేది తగ్గిపోతోంది. టీవీల కంటే స్ట్రీమింగ్ యాప్స్‌లో మరిన్ని అదనపు ఫీచర్లు లభిస్తుండటం కూడా క్రీడాభిమానులను అటువైపు మరలేలా చేస్తోంది.


Similar News