ధోనీ విషయంలో పెద్ద తప్పు చేశాను.. క్షమాపణలు కోరిన దినేశ్ కార్తీక్

భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఇటీవల తాను ప్రకటించిన టీమ్ ఇండియా ఆల్‌టైం జట్టులో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని విస్మరించాడు.

Update: 2024-08-22 14:56 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఇటీవల తాను ప్రకటించిన టీమ్ ఇండియా ఆల్‌టైం జట్టులో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని విస్మరించాడు. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన ధోనీకి చోటు కల్పించకపోవడంతో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా దీనిపై కార్తీక్ స్పందించాడు. ధోనీని విస్మరించడంపై క్షమాపణలు చెప్పాడు. చాలా పెద్ద తప్పు చేశానని అంగీకరించాడు. అలాగే, ధోనీకి స్థానం కల్పించకపోవడంపై వివరణ ఇచ్చాడు.

‘నిజంగా అది పొరపాటు మాత్రమే. కావాలని చేయలేదు. ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాతే నాకు అర్థమైంది. రాహుల్ ద్రవిడ్‌ను పార్ట్ టైం వికెట్ కీపర్‌గా తీసుకున్నానని అందరూ అనుకున్నారు. కానీ, ద్రవిడ్‌ను వికెట్ కీపర్‌గా అనుకోలేదు. నేను వికెట్ కీపర్‌ను మర్చిపోయానంటే మీరు నమ్ముతారా?. చాలా పెద్ద పొరపాటు జరిగింది. ధోనీ పేరు ఏ ఫార్మాట్‌లోనైనా ఉంటుంది. గొప్ప క్రికెటర్లలో అతనొక్కడని భావిస్తా. టీమిండియా ఆల్‌టైం జట్టును మళ్లీ ప్రకటించాల్సి వస్తే నేను చేసే ఒకే ఒక్క మార్పు ధోనీని చేర్చడమే. 7వ స్థానం అతనిదే. అలాగే, ఏ భారత జట్టుకు అయినా అతను కెప్టెన్‌గా ఉంటాడు.’ అని తెలిపాడు.

కాగా, ఇటీవల కార్తీక్ తన టీమిండియా ఆల్‌టైం జట్టులో సెహ్వాగ్, సచిన్, ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్‌, యువరాజ్ వంటి దిగ్గజాలకు చోటు కల్పించాడు. అలాగే, ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్, కోహ్లీ, జడేజా, అశ్విన్, బుమ్రాలను తీసుకున్నాడు.

Tags:    

Similar News