ఇండోనేషియా ఓపెన్‌లో లక్ష్యసేన్, గాయత్రి జోడీ శుభారంభం

ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో భారత స్టార్ సింగిల్స్ ప్లేయర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు.

Update: 2024-06-04 14:03 GMT

దిశ, స్పోర్ట్స్ : జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో భారత స్టార్ సింగిల్స్ ప్లేయర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 21-12, 21-17 తేడాతో జపాన్ ఆటగాడు కాంట సునేయమను చిత్తు చేశాడు. రెండు గేముల్లోనూ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన లక్ష్యసేన్ 40 నిమిషాల్లో మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. రెండో రౌండ్‌లో అతను వరల్డ్ నం.12 కెంటా నిషిమోటో(జపాన్)తో తలపడనున్నాడు.

మరో స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ దారుణంగా నిరాశపరిచాడు. తొలి రౌండ్‌లో అతనికి సహచర ఆటగాడు ప్రియాన్షు రజావత్ షాకిచ్చాడు. ప్రణయ్‌పై 21-17, 21-12 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో గాయత్రి జోడీ 21-15, 21-11 తేడాతో యు పీ చెంగ్-యు హ్సింగ్ సన్(చైనీస్ తైపీ)పై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్-సిక్కిరెడ్డి ద్వయం 18-21, 21-16, 21-17 తేడాతో అమెరికాకు చెందిన విన్సన్ చియు-జెన్నీ గై జంటపై పోరాడి గెలిచింది. 


Similar News