ప్రతిభావంతులకు అవకాశాలు దక్కట్లేదు: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్
కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో టెస్టు జట్టు అత్యుత్తమంగా ఉన్నదని, ఆ తర్వాత జట్టు ప్రదర్శన బాగా లేదన్నాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత జట్టులో ప్రతిభావంతులకు అవకాశాలు దక్కడం లేదని భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘోర ఓటమిపై తాజాగా క్రిస్ శ్రీకాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ టీమ్ ఇండియాపై విరుచుకపడ్డాడు. ‘ఐసీసీ ర్యాంకింగ్స్‌ను మర్చిపోయే సమయం వచ్చింది. భారీ అంచనాలు ఉన్న భారత క్రికెటర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. అదే సమయంలో కుల్దీప్ యాదవ్ లాంటి ప్రతిభావంతులకు అవకాశాలు రావడం లేదు.’ అని చెప్పాడు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో టెస్టు జట్టు అత్యుత్తమంగా ఉన్నదని, ఆ తర్వాత జట్టు ప్రదర్శన బాగా లేదన్నాడు. ‘గత 2-4 ఏళ్లలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు టెస్టు ఫార్మాట్‌లో మనం అత్యుత్తమంగా ఉన్నాం. ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం ప్రదర్శించాం. సౌతాఫ్రికాతో గట్టిగా పోరాడాం. ఆస్ట్రేలియాలో విజయం సాధించాం.’ అని చెప్పాడు. తొలి టెస్టు మ్యాచ్ అనంతరం టెస్టు మ్యాచ్‌లు ఎలా గెలవాలో తమకు తెలుసని, విదేశాల్లోనూ తాము సత్తాచాటమని రోహిత్ చేసిన వ్యాఖ్యలకు క్రిస్ శ్రీకాంత్ కౌంటర్ ఇచ్చాడు. పాత పాటే పాడటం వల్ల ముందుకు సాగలేమని, గత రెండేళ్లలో ఏం చేశామో చూడాలన్నాడు.