అంపైర్ తప్పిదంతో మరో సారి కోహ్లీ.. ఆలౌట్ దిశగా భారత్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు.

Update: 2023-02-18 09:31 GMT

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీ(84 బంతుల్లో 4 ఫోర్లతో 44) అంపైర్ తప్పుడు నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ వికెట్ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇది అన్యాయమైన నిర్ణయమని రియాక్షన్ ఇచ్చారు. కోహ్లీ సైతం అంపైర్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ క్రీజును వీడాడు. డగౌట్‌లో రిప్లే చూసి మరింత షాక్‌కు గురయ్యాడు.

 అసలు ఇదీ విషయం.. 

ప్రస్తుతం విరాట్ కోహ్లీ వికెట్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వగా.. అభిమానులు అంపైర్‌పై మండిపడుతున్నారు. రోహిత్ శర్మ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. రవీంద్ర జడేజాతో కలిసి జట్టును ఆదుకున్న ప్రయత్నం చేశాడు. ఐదో వికెట్‌కు 59 పరుగులు జోడించిన అనంతరం జడేజా(26) ఔటైనా.. కోహ్లీ సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియ యువ స్పిన్నర్ మాథ్యూ కున్నేమన్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఇక అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు.

బ్యాట్, ప్యాడ్ ఒకేసారి తాకిన బంతి..

రిప్లేలో బంతి.. బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి తాకినట్లు కనిపించింది. దాంతో థర్డ్ అంపైర్... బంతి బ్యాట్ ను ముందుగా తాకినట్లు ఆధారాలు లేవని, ఫీల్డ్ అంపైర్‌కు కట్టుబడి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను తాకుతూ అంపైర్స్ కాల్‌గా వెళ్లింది. దాంతో విరాట్ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఫీల్డ్ అంపైర్ నితీన్ మీనన్‌పై అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీ విషయంలో మీనన్ తప్పు చేయడం ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా ఇలానే చేశాడని ట్రోలింగ్‌కు దిగుతున్నారు.

అంపైర్ల పొరపాటు స్పష్టం

కొందరు మాత్రం బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాటర్ రూల్ కింద నాటౌట్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. అంపైర్ తప్పిదం టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపనుందని, ఇంత టెక్నాలజీ ఉన్నా.. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. ఇక పుజారా విషయంలోనూ ఈ తరహా తప్పుడు నిర్ణయం తీసుకున్నారని, అతను ఔటైనా నాటౌటిచ్చారని గుర్తు చేస్తున్నారు.

ఆలౌట్ దిశగా భారత్..

రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. నాథన్ లయన్ దెబ్బకు 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో సెట్ అయిన కెప్టెన్ రోహిత్(32)‌తో పాటు కేఎల్ రాహుల్(17), పుజారా(0), శ్రేయస్ అయ్యర్(4) నాథన్ బౌలింగ్‌లోనే వెనుదిరిగారు. ఆ తర్వాత కీలక భాగస్వామ్యం అందించిన విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా జోడీని మర్ఫి విడదీసాడు. జడేజా ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వివాదాస్ప రీతిలో విరాట్ ఔటవ్వగా.. కేఎస్ భరత్‌ను లయన్ ఔట్ చేసి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌.. అశ్విన్‌తో కలిసి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దాంతో రెండో సెషన్ ముగిసే సమయానికి భారత్ 7 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఇంకా 61 పరుగుల వెనుకంజలో ఉంది.

Tags:    

Similar News