T20 World Cup-2024: టీ20 వరల్డ్ కప్-2024కు ఐర్లాండ్, స్కాట్లాండ్ క్వాలిఫై

వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు స్కాట్లాండ్, ఐర్లాండ్ అర్హత సాధించాయి.

Update: 2023-07-27 15:08 GMT

ఎడిన్‌బర్గ్ : వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు స్కాట్లాండ్, ఐర్లాండ్ అర్హత సాధించాయి. యూరోప్ క్వాలిఫయర్ టోర్నీ నుంచి ఈ రెండు జట్లు టీ20 వరల్డ్ కప్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. యూరోప్ క్వాలిఫయర్ రీజినల్ ఫైనల్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో డెన్మార్క్‌పై 33 పరుగుల తేడాతో గెలుపొందడంతో స్కాట్లాండ్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 18 ఓవర్లలో 159/7 స్కోరు చేసింది. కెప్టెన్ బెర్రింగ్‌టన్(60) రాణించాడు. ఛేదనకు దిగిన డెన్మార్క్‌ను స్కాట్లాండ్ బౌలర్లు సమిష్టిగా రాణించిన కట్టడి చేశారు. దాంతో నిర్ణీత ఓవర్లలో డెన్మార్క్ డెన్మార్క్ 126/7 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ హమిద్ షా(56) పోరాడినా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు.

టోర్నీలో ఐదో విజయంతో స్కాట్లాండ్ ప్రపంచకప్‌ బెర్త్‌ను దక్కించుకుంది. మరోవైపు, జర్మనీ, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దాంతో టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు నెగ్గిన ఐర్లాండ్ సైతం పొట్టి వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం పాయింట్స్‌లో స్కాట్లాండ్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఐర్లాండ్ 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. తమ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్, ఐర్లాండ్ తలపడనున్నాయి. టీ20 వరల్డ్ కప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.



Similar News