ఇరానీ కప్ విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా..
ఇరానీ కప్-2023 ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా కైవసం చేసుకుంది.
గ్వాలియర్: ఇరానీ కప్-2023 ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా కైవసం చేసుకుంది.మధ్యప్రదేశ్‌పై 238 పరుగుల తేడాతో విజయం సాధించి 30వ సారి ఇరానీ కప్ విజేతగా నిలిచింది. 437 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మధ్యప్రదేశ్ 198 పరుగులకే ఆలౌట్ కావడంతో రెస్ట్ ఆఫ్ ఇండియాకు భారీ విజయం దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 81/2తో చివరి రోజు ఆదివారం ఛేదనను కొనసాగించిన మధ్యప్రదేశ్ ఒక్క పరుగు కూడా జతచేయకుండానే కీలక వికెట్‌ను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ హిమాన్షు మంత్రి(51) నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. కాసేపటికే యష్ దూబె(8) సైతం వెనుదిరిగగా.. హర్ష్(48), అమన్ సోలంకి(31), అంకిత్(23) కాసేపు పోరాటం చేశారు.
అయితే, రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో మధ్యప్రదేశ్ తొలి సెషన్‌లోనే 9 వికెట్లను కోల్పోయి ఓటమిపాలైంది. సౌరభ్ కుమార్ బౌలింగ్‌లో కుమార్ కార్తికేయ(7) వెనుదిరగడంతో 198 పరుగులకే మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో చివరి రోజు తొలి సెషన్‌లోనే రెస్ట్ ఆఫ్ ఇండియా విజయం లాంఛనమైంది. బౌలర్లలో సౌరభ్ కుమార్ 3 వికెట్లు తీయగా.. అతిత్ సేత్, పుల్‌కిత్ నారంగ్ చెరో 2 వికెట్లు, నవ్‌దీప్ సైనీకి ఒక వికెట్ దక్కింది.
మ్యాచ్‌లో డబుల్ సెంచరీతోపాటు సెంచరీ నమోదు చేసిన యశస్తి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 484 పరుగుల భారీ స్కోరు చేయగా.. మధ్యప్రదేశ్ 294 పరుగులు చేసింది. దాంతో 190 ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రెస్ట్ ఆఫ్ ఇండియా 246 పరుగులు చేయడంతో మధ్యప్రదేశ్ ముందు 437 పరుగుల లక్ష్యం నిర్దేశించిన విషయం తెలిసిందే.
Also Read...