ప్లేయర్ల రిటెన్షన్ జాబితాకు డెడ్‌లైన్.. ఫ్రాంచైజీలకు ఆదేశాలు
ఐపీఎల్ రిటెన్షన్స్ రూల్స్‌పై స్పష్టత వచ్చింది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ రిటెన్షన్స్ రూల్స్‌పై స్పష్టత వచ్చింది. ప్రస్తుత జట్టు నుంచి ప్రతి ఫ్రాంచైజీ నేరుగా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ వీలు కల్పించింది. గతంలో నలుగురిని మాత్రమే అంటిపెట్టుకునే చాన్స్ ఉండగా.. ఈ సారి ఐదుగురికి అనుమతినిచ్చింది. అలాగే, ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది గడువు నిర్దేశించినట్టు తెలుస్తోంది. తాము రిటైన్ చేసుకున్న ఐదుగురి ఆటగాళ్ల జాబితాను వచ్చే నెల 31లోపు సమర్పించాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాను సిద్ధం చేసేలా పనిలో పడ్డాయి. ఎవరిని అంటిపెట్టుకోవాలి? వేలంలోకి ఎవరిని రిలీజ్ చేయాలి? అనే విషయాలపై ఫ్రాంచైజీలు ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో మెగా వేలం నిర్వహించే అవకాశం ఉంది. వేలంలోకి రిలీజ్ చేసిన ప్లేయర్లలో ఒకరిని తిరిగి పొందేందుకు ఫ్రాంచైజీలకు చాన్స్ ఉంది. రైట్ టూ మ్యాచ్(ఆర్‌టీఎం) కార్డును తిరిగి అమలు చేయనున్నట్టు గవర్నింగ్ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.