చరిత్ర సృష్టించిన భారత సర్ఫర్లు.. సర్ఫింగ్‌లో భారత్‌కు తొలి ఆసియా గేమ్స్ కోటా

భారత సర్ఫర్లు చరిత్ర సృష్టించారు. సర్ఫింగ్‌లో ఆసియా గేమ్స్ కోటా సాధించారు.

Update: 2024-08-24 18:04 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత సర్ఫర్లు చరిత్ర సృష్టించారు. సర్ఫింగ్‌లో ఆసియా గేమ్స్ కోటా సాధించారు. సర్ఫింగ్‌లో ఆసియా క్రీడలకు క్వాలిఫై అవ్వడం భారత్‌కు ఇదే తొలిసారి. 2026లో జరగబోయే ఆసియా గేమ్స్‌‌కు భారత పురుషుల, మహిళల సర్ఫింగ్ జట్లు అర్హత సాధించాయి. మాల్దీవుల్లో జరుగుతున్న ఏషియన్ సర్ఫింగ్ చాంపియన్‌షిప్‌లో ర్యాంకింగ్ పాయింట్ల ఆధారంగా భారత సర్ఫర్లకు కోటా దక్కింది. ఆ టోర్నీలో భారత్ తరపున 8 మంది 4 కేటగిరీల్లో పాల్గొన్నారు. భారత్ ఆసియా క్రీడలకు అర్హత సాధించడంలో కిశోర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. అండర్-18 కేటగిరీలో రౌండ్ 1, రౌండ్ 3, క్వార్టర్ ఫైనల్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. సెమీస్‌లో హీట్-2లో 8.26 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి తృటిలో ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయాడు. అలాగే, మరో సర్ఫర్ హరీష్ ముత్తు తనదైన ముద్ర వేశాడు. ఆసియా సర్ఫింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత సర్ఫర్‌గా నిలిచాడు. అయితే, క్వార్టర్స్‌లో అతను ఓటమిపాలయ్యాడు. మహిళల విభాగంలో కమలీ మూర్తి, షుగర్ బనార్సే పోటీపడగా.. వారిద్దరూ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించారు. 


Similar News