టీమిండియాకు షాకిచ్చిన ఐసీసీ.. ఆ నిబంధనను ఉల్లంఘించినందుకు చర్యలు

భారత మహిళల జట్టుకు ఐసీసీ షాక్ ఇచ్చింది.

Update: 2024-12-12 11:51 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ వైట్‌వాష్ అయిన బాధలో ఉన్న భారత మహిళల క్రికెట్‌కు ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. ఈ నెల 8న బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ 122 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన నిర్ణీత సమయంలోగా రెండు ఓవర్లు తక్కువగా వేసింది.

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. స్లో ఓవర్‌రేట్ నిబంధనను భారత్ అతిక్రమించింది. ఆ నిబంధన ప్రకారం నిర్ణీత సమయంలోగా వేయని ప్రతి ఓవర్‌కు ఐదు శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించొచ్చు. రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో ఐసీసీ భారత్‌కు 10 శాతం ఫైన్ వేసింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేరాన్ని అంగీకరించిందని ఐసీసీ తెలిపింది. కాగా, ఆసిస్ టూరులో ఘోరంగా విఫలమైన భారత జట్టు 3-0తో సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. ఆఖరిదైన మూడో వన్డేలో స్మృతి మంధాన సెంచరీతో రాణించినప్పటికీ ఆమె శ్రమ వృథా అయ్యింది.


Tags:    

Similar News