చరిత్ర సృష్టించిన గుకేశ్.. చెస్ వరల్డ్ చాంపియన్‌గా 18 ఏళ్ల యువ సంచలనం
భారత యువ సంచలనం దొమ్మరాజు.గుకేశ్ చరిత్ర సృష్టించాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత యువ సంచలనం దొమ్మరాజు.గుకేశ్ చరిత్ర సృష్టించాడు. చెస్ వరల్డ్ చాంపియన్‌గా అవతరించాడు. సింగపూర్‌లో జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టోర్నీలో గురువారం జరిగిన ఆఖరిదైన 14వ గేములో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. నల్లపావులతో ఆడిన గుకేశ్ 58 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఈ గెలుపుతో అతను 14 గేముల టోర్నీలో 7.5-6.5 తేడాతో విజేతగా నిలిచాడు. దీంతో 18 ఏళ్ల గుకేశ్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన రెండో భారతీయుడిగా ఘనత సాధించాడు.