Paris olympics : స్వర్ణం గెలవకుండానే.. పారిస్ ఒలింపిక్స్‌లో ముగిసిన భారత్ పోరాటం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. వరుసగా రెండు రోజులు పతకాలు గెలిచిన భారత్‌కు చివరి రోజైన శనివారం మెడల్ దక్కలేదు.

Update: 2024-08-10 19:41 GMT
Paris olympics : స్వర్ణం గెలవకుండానే.. పారిస్ ఒలింపిక్స్‌లో ముగిసిన భారత్ పోరాటం
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. వరుసగా రెండు రోజులు పతకాలు గెలిచిన భారత్‌కు చివరి రోజైన శనివారం మెడల్ దక్కలేదు. రెజ్లింగ్‌లో రీతిక క్వార్టర్స్‌లో పరాజయం పాలవ్వగా.. గోల్ఫ్‌లో అదితి అశోక్, దిక్ష దగర్ నిరాశపరిచారు. దీంతో భారత్ ఆరు పతకాలతో ఈ విశ్వక్రీడలను ముగించింది. స్వర్ణ పతకం లేకుండానే ఒలింపిక్స్‌ను ముగించడం గమనార్హం. ఆరు పతకాల్లో ఐదు కాంస్యాలు, ఓ రజతం ఉన్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరపున 16 క్రీడల్లో 69 మెడల్ ఈవెంట్లలో 117 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. షూటింగ్‌లో అత్యధికంగా మూడు కాంస్య పతకాలు దక్కాయి. అందులో రెండు మను బాకర్ సాధించినవే కావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో మను దేశానికి తొలి పతకం అందించింది. అదే విభాగంలో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యం దక్కించుకుంది. అలాగే, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాల్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. రెజ్లింగ్‌లో 57 కేజీల ఫ్రీస్టైల్ కేటగిరీలో అమన్ సెహ్రావత్ కంచు పట్టు పట్టగా.. హాకీ జట్టు వరుసగా రెండో ఒలింపిక్స్‌లో కంచు మోత మోగించింది. మరోసారి బంగారు పతకం ఆశలు రేపిన స్టార్ జావెలిన్ త్రోయర్ రజతంతో సరిపెట్టాడు. కనీసం 10 పతకాలు లక్ష్యంగా పారిస్‌లో అడుగుపెట్టిన భారత అథ్లెట్లు ఆరు పతకాలతోనే సరిపెట్టారు. టోక్యో ఒలింపిక్స్(7 పతకాలు) ప్రదర్శనను కూడా అధిగమించలేకపోయారు.

క్వార్టర్స్‌లో రీతికకు షాక్

మహిళల ఫ్రీస్టైల్ 76 కేజీల కేటగిరీలో పోటీపడిన రెజ్లర్ రీతిక హుడా చివరి పతకం అందిస్తుందని భారత్ ఆశించింది. కానీ, ఆమె పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. అయితే, శనివారం ఆమె శుభారంభమే చేసింది. మొదటి బౌట్‌లో రీతిక 12-2 తేడాతో బెర్నాడెట్ నాగి(హంగేరి)ని మట్టికరిపించి క్వార్టర్స్‌కు చేరుకుంది. అయితే, అక్కడ ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. కిర్గిస్తాన్ రెజ్లర్ ఐపెరి మెడిట్ కిజీ చేతిలో 1-1 తేడాతో ఓడిపోయింది. ఇద్దరు రెజ్లర్లు సమంగా నిలిచినా.. కిజీ చివరి పాయింట్ నెగ్గడంతో రీతిక పోరాటం వృథా అయ్యింది. అయితే, కిజీ ఫైనల్‌కు చేరుకుంటే రీతిక బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌కు వెళ్లే అవకాశం ఉండేది. కానీ, కిజీ సెమీస్‌లో ఓడటంతో రీతిక ఆ చాన్సూ దక్కలేదు.

గోల్ఫ్‌లో నిరాశపర్చిన అదితి, దిక్ష

గోల్ఫ్‌లో భారత్‌కు చెందిన అదితి అశోక్, దిక్ష దగర్ నిరాశపరిచారు. నాలుగు రౌండ్లలో జరిగిన ఈవెంట్‌లో తొలి రెండు రౌండ్లలో అదితి, దిక్ష పర్వాలేదనిపించారు. అయితే, చివరి రెండు రౌండ్లలో తేలిపోయారు. ఆఖరిదైన నాలుగో రౌండ్‌ ముగిసే సరికి అదితి 29వ స్థానంలో నిలువగా.. దిక్ష 29వ స్థానంతో సరిపెట్టింది.

Tags:    

Similar News