భారత హెడ్ కోచ్‌ పదవికి దరఖాస్తులకు ముగిసిన గడువు

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది.

Update: 2024-05-27 19:22 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త హెడ్ కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించగా అప్లై చేసుకోవడానికి సోమవారంతో గడువు ముగిసింది. అయితే, ఎవరెవరు?.. ఎంత మంది? దరఖాస్తు చేసుకున్నారనే దానిపై స్పష్టత లేదు. అయితే, తదుపరి హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపడతాడని వార్తలు వస్తున్నాయి. అయితే, అతను దరఖాస్తు చేసుకున్నాడా?లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గంభీర్ మెంటార్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన బీసీసీఐ సెక్రెటరీ జై షా.. గంభీర్‌తో మాట్లాడుతూ కనిపించాడు. హెడ్ కోచ్ పదవి గురించే చర్చించినట్టు జాతీయ మీడియాలో వస్తున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐగానీ, గంభీర్‌గానీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

మరోవైపు, హెడ్ కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ మరింత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది.‘తుది గడువు అయిపోయింది. కానీ, నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ మరి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నది. టీ20 ప్రపంచకప్‍తో భారత జట్టు బిజీగా ఉంటుంది. ఆ తర్వాత శ్రీలంక, జింబాబ్వే సిరీస్‌లకు ఎన్‍సీఏ నుంచి సీనియర్ కోచ్ జట్టుకు అందుబాలులో ఉంటారు. కాబట్టి, హెడ్ కోసం విషయంలో తొందరేం లేదు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

Tags:    

Similar News