రాజ్‌కోట్‌లో దుమ్ములేపారు.. జైశ్వాల్ డబుల్ ధమాకా, జడేజా స్పిన్ మాయ
యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతోపాటు జడేజా స్పిన్ మంత్రంతో మాయ చేసిన వేళ టీమ్ ఇండియా భారీ విజయం సాధించింది.
దిశ, స్పోర్ట్స్ : రాజ్‌కోట్ టీమ్ ఇండియాదే. మూడో టెస్టులో దుమ్ములేపిన భారత ఆటగాళ్లు మూడో టెస్టును ఏకపక్షం చేశారు. నాలుగో రోజు యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతోపాటు జడేజా స్పిన్ మంత్రంతో మాయ చేసిన వేళ టీమ్ ఇండియా భారీ విజయం సాధించింది. మరో రోజు మిగిలి ఉండగానే గెలుపు లాంఛనమైంది. ఆదివారం 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. 557 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రత్యర్థి జట్టు 122 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 196/2తో ఆదివారం ఆట కొనసాగించిన భారత్ 430/4 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చింది. గిల్(91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మూడో రోజు రిటైర్డ్ హార్ట్‌గా మైదానం వీడిన జైశ్వాల్(214 నాటౌట్, 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లు) తిరిగి క్రీజులోకి వచ్చి డబుల్ సెంచరీ బాదాడు. అతనికితోడుగా దూకుడుగా ఆడిన సర్ఫరాజ్ ఖాన్(68 నాటౌట్, 72 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) నాటౌట్‌గా ఉన్నాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 172 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారీ ఆధిక్యం లభించగా.. మొదటి సెషన్ ముగిసిన కాసేపటికే టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చింది. అనంతరం 557 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తేలిపోయింది. మార్క్‌వుడ్(33)టాప్ స్కోరర్. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ జడేజా(5/41) స్పిన్ మాయతో ప్రత్యర్థి పతనాన్ని శాసించడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. దీంతో నాలుగో రోజే ఇంగ్లాండ్ ఆట ముగియగా.. మరో రోజు మిగిలి ఉండగానే టీమ్ ఇండియా విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
జడేజా ఉచ్చులో ఇంగ్లాండ్ విలవిల
557 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కనీసం పోరాటం చేయలేకపోయింది. మార్క్‌వుడ్ చేసిన 33 పరుగులే టాప్ స్కోరంటే ఇంగ్లాండ్ ఏ విధంగా తేలిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జడేజా ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు జడేజా స్పిన్ ఉచ్చులో పడి పెవిలియన్‌కు క్యూకట్టారు. ఓపెనర్ బెన్ డక్కెట్(4) రనౌట్‌తో ఆ జట్టు పతనం మొదైలంది. కాసేపటికే మరో ఓపెనర్ జాక్ క్రాలీ(11)ని బుమ్రా అవుట్ చేయగా.. ఆ తర్వాత జడేజా ఇంగ్లాండ్ నడ్డివిరిచాడు. వరుస ఓవర్లలో ఓలి పోప్(3), బెయిర్‌స్టో(4)లను వికెట్ల ముందు దొరకబచ్చుకోగా.. కాసేపటికే జో రూట్(7)ను అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా ఇంగ్లాండ్ తరపున ఎవరూ కనీసం పోరాడలేకపోయారు. అదే స్కోరు వద్ద కెప్టెన్ బెన్‌స్టోక్స్(15), రెహాన్ అహ్మద్(0) కూడా మైదానం వీడారు. బెన్ ఫోక్స్(16), టీమ్ హార్ట్లీ(16) క్రీజులో ఉన్నది కాసేపే. ఇక, చివరి వికెట్‌గా మార్క్‌వుడ్(33)ను జడేజా అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ ఆట ముగిసింది. ఆటలో మరో రోజు సమయం ఉన్నప్పటికీ భారీ లక్ష్య ఛేదనలో ఒత్తిడికి గురై ఇంగ్లాండ్ బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ 2 వికెట్లు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ తీశారు.
జైశ్వాల్ ద్విశతకం.. సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ
అంతకుముందు టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రతాపం చూపించింది. యశస్వి జైశ్వాల్ ద్విశతకానికి శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ మెరవడంతో ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 196/2తో నాలుగో రోజు భారత్ ఆట కొనసాగించగా.. ఓవర్‌నైట్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్ మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. కుల్దీప్ ఏ మాత్రం ఆసిస్ బౌలర్లకు బెదరకుండా తన వంతు సహకారం అందించగా.. మరో ఎండ్‌లో గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే, గిల్(91) రనౌట్ రూపంలో వికెట్ పారేసుకుని తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కాసేపటికే కుల్దీప్ యాదవ్(27) కూడా వెనుదిరిగాడు. మూడో రోజు సెంచరీ తర్వాత వెన్నుముక నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన యశస్వి జైశ్వాల్.. గిల్ అవుటైన తర్వాత మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అతనికి సర్ఫరాజ్ ఖాన్ తోడయ్యాడు. వీరిద్దరూ వన్డే తరహాలో బ్యాటు ఝుళిపించారు. అండర్సన్, రెహాన్ అహ్మద్, రూట్ బౌలింగ్‌లో పరుగులు పిండుకున్నారు. ఈ జంటను విడదీసేందుకు ఇంగ్లాండ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అండర్సన్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టిన జైశ్వాల్.. చూస్తుండగానే ద్విశతకం పూర్తి చేశాడు. 231 బంతుల్లో డబుల్ సెంచరీ బాదేశాడు. ఈ సిరీస్‌లో జైశ్వాల్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లోనూ అతను ద్విశతకం బాదిన విషయం తెలిసిందే. మరోవైపు, సర్ఫరాజ్ ఖాన్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ తొలి ఇన్నింగ్స్‌ను అర్ధ శతకం చేశాడు. కాసేపటికే టీమ్ ఇండియా 430/4 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చింది. ఐదో వికెట్‌కు జైశ్వాల్(214 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్(68 నాటౌట్) 172 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్, టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మద్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 445 ఆలౌట్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 319 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ : 430/4 డిక్లేర్డ్(98 ఓవర్లు)
యశస్వి జైశ్వాల్ 214 నాటౌట్, రోహిత్ ఎల్బీడబ్ల్యూ(బి)రూట్ 19, గిల్ రనౌట్(స్టోక్స్/టామ్ హార్ట్లీ) 91, రజత్ పాటిదార్(సి)రెహాన్ అహ్మద్(బి)టామ్ హార్ట్లీ 0, కుల్దీప్(సి)రూట్(బి)రెహాన్ అహ్మద్ 27, సర్ఫరాజ్ ఖాన్ 68 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11.
వికెట్ల పతనం : 30-1, 191-2, 246-3, 258-4
బౌలింగ్ : అండర్సన్(13-1-78-0), రూట్(27-3-111-1), టామ్ హార్ట్లీ(23-2-78-1), మార్క్‌వుడ్(10-0-46-0), రెహాన్ అహ్మద్(25-1-46-0)
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 122 ఆలౌట్(39.4 ఓవర్లు)
జాక్ క్రాలీ ఎల్బీడబ్ల్యూ(బి)బుమ్రా 11, బెన్ డక్కెట్ రనౌట్(సిరాజ్/ధ్రువ్ జురెల్) 4, ఓలి పోప్(సి)రోహిత్(బి)జడేజా 3, రూట్ ఎల్బీడబ్ల్యూ(బి)జడేజా 7, బెయిర్‌స్టో ఎల్బీడబ్ల్యూ(బి)జడేజా 4, బెన్‌స్టోక్స్ ఎల్బీడబ్ల్యూ(బి)కుల్దీప్ 15, బెన్ ఫోక్స్(సి)ధ్రువ్ జురెల్(బి)జడేజా 16, రెహాన్ అహ్మద్(సి)సిరాజ్(బి)కుల్దీప్ 0, టామ్ హార్ట్లీ(బి)అశ్విన్ 16, మార్క్‌వుడ్(సి)జైశ్వాల్(బి)జడేజా 33, అండర్సన్ 1 నాటౌట్;ఎక్స్‌ట్రాలు 12.
వికెట్ల పతనం : 15-1, 18-2, 20-3, 28-4, 50-5, 50-6, 50-7, 82-8, 91-9, 122-10
బౌలింగ్ : బుమ్రా(8-1-18-1), సిరాజ్(5-2-16-0), జడేజా(12.4-4-41-5), కుల్దీప్ యాదవ్(8-2-19-2), అశ్విన్(6-3-19-1)