రోహిత్ సేన పుంజుకునేనా?.. నేడు విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ప్రారంభం

నేటి నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.

Update: 2024-02-01 17:40 GMT

దిశ, స్పోర్ట్స్ : తొలి టెస్టులో అనూహ్య ఓటమితో టీమ్ ఇండియా ఐదు టెస్టుల సిరీస్‌లో వెనుకబడింది. మొదటి టెస్టు ఆరంభంలో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో పట్టు విడిచింది. బౌలింగ్‌తో ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోయింది. ముఖ్యంగా బ్యాటుతో చేతులెత్తేసింది. ఈ పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్న ఇంగ్లాండ్ అనూహ్యంగా పుంజుకుని తొలి టెస్టును ఖాతాలో వేసుకుంది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సిరీస్‌లో కష్టాల్లో పడకముందే టీమ్ ఇండియా పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా రెండో టెస్టులో బరిలోకి దిగుతున్నది. నేటి నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌‌ను 1-1తో సమం చేయాలని భారత జట్టు భావిస్తున్నది. మరోవైపు, తొలి టెస్టు విజయంతో జోరు మీద ఉన్న ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో రెండో మ్యాచ్‌లో అడుగుపెడుతున్నది. కీలక ప్లేయర్లు దూరమవడం టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బే. కాబట్టి, సిరీస్‌లో పుంజుకునేందుకు రోహిత్ సేన అన్ని విభాగాల్లో రాణించాల్సిన అవసరం ఉన్నది.

స్టార్లు దూరం.. శక్తికి మించి రాణించాల్సిందే

రెండో టెస్టుకు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీలతోపాటు గాయాల కారణంగా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా దూరమైన విషయం తెలిసిందే. కీలక ప్లేయర్లు దూరమవడంతో రెండో టెస్టులో భారత్ శక్తికి మించి పోరాడాల్సిన అవసరం ఉంది. అన్ని విభాగాల్లోనూ రాణిస్తేనే జట్టుకు విజయం దక్కే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ శర్మ, యశస్వి జైశాల్ మంచి ఆరంభాన్ని అందించాల్సి ఉంది. రాహుల్ దూరమైన నేపథ్యంలో మిడిలార్డర్ భారం గిల్, శ్రేయస్ అయ్యర్‌పైనే ఉంది. గిల్ పేలవ ఫామ్‌పై ఆందోళనకరంగా ఉంది. తొలి టెస్టులో అతను దారుణంగా నిరాశపర్చగా.. అయ్యర్ సైతం పెద్దగా రాణించలేదు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉన్నది. ఐదో స్థానం కోసం రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ పోటీపడుతున్నారు. ఎవరికీ చోటు దక్కినా టెస్టు అరంగేట్రం చేయనున్నారు. రజత్ పాటిదార్ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపున్నట్టు తెలుస్తోంది. హోంగ్రౌండ్‌లో తొలి టెస్టు ఆడబోతున్న వికెట్ కీపర్ కేఎస్ భరత్‌పై అందరి దృష్టి ఉండనుంది. ఈ మ్యాచ్‌లో అతను చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. జడేజా దూరమవడంతో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు ఖాయంగా కనిపిస్తుంది. అతనితోపాటు అశ్విన్, అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. బుమ్రా, సిరాజ్ పేస్ దళంలో ఉండనున్నారు.

ప్రత్యర్థితో జాగ్రత్త

తొలి టెస్టులోనే ఇంగ్లాండ్‌ సామర్థ్యాలపై భారత్‌కు ఓ అంచనా వచ్చే ఉంటుంది. కాబట్టి, రెండో టెస్టులో గెలుపు తీరాలకు వెళ్లే వరకూ భారత్ జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. మొదటి టెస్టులో భారీ సెంచరీ బాదిన ఓలీ పోప్‌తోపాటు కెప్టెన్ బెన్ స్టోక్స్, జాక్ క్రాలీ, జోరూట్, బెయిర్‌స్టోలతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. అంతేకాకుండా, బౌలింగ్‌పరంగా కూడా ఆ జట్టుకు వంక పెట్టడానికి లేదు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లను బెంబేలెత్తించిన టామ్ హార్ట్లీ‌ మరోసారి సవాల్ విసరనున్నాడు. అతనితోపాటు సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తిరిగి జట్టులోకి రావడంతో ఇంగ్లాండ్ బౌలింగ్ బలం పెరిగిందనే చెప్పొచ్చు. స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ దూరమవడం ఆ జట్టుకు పెద్ద లోటే. అతని స్థానంతో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. జోరూట్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో అతను 4 వికెట్లతో రాణించాడు.

అప్పుడు భారత్‌దే పైచేయి

విశాఖపట్నం స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్లకు ఇది రెండో టెస్టు. 2016లో ఇరు జట్లు తొలిసారి ఇక్కడ టెస్టులో తలపడగా.. భారత్ 246 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. కోహ్లీ(167), పుజారా(119) సెంచరీలతో మెరవగా.. అశ్విన్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత అశ్విన్ ఐదు వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే కుప్పకూలింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ(81) అండతో భారత్ 204 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 200 పరుగులు కలుపుకుని ఇంగ్లాండ్ ముందు 404 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. ఛేదనలో ఇంగ్లాండ్ 158 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్, జయంత్ యాదవ్ 3 వికెట్లుతో రాణించగా.. జడేజా, షమీ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. 2019లో భారత్ ఇక్కడ చివరిసారిగా సౌతాఫ్రికాతో తలపడగా.. ఆ మ్యాచ్‌లోనూ భారత్ భారీ విజయం అందుకుంది.

పిచ్ రిపోర్ట్

విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. అలాగే, స్పిన్నర్లు ఇక్కడ సవాల్ విసరనున్నారు. ఇక్కడ రెండు టెస్టులు జరగగా.. రెండింట్లోనూ టీమ్ ఇండియానే నెగ్గింది. ఇది భారత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపేదే. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టతరం కావొచ్చు.

తుది జట్లు

భారత్(అంచనా) : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్/సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లాండ్ : జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, ఓలీ పోప్, జోరూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్. 

Tags:    

Similar News