వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ

ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023కు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2023-05-23 14:16 GMT

దుబాయ్: ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023కు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. మరో రెండు జట్లు క్వాలిఫయర్స్ ద్వారా చేరనున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించింది.

జింబాబ్వే వేదికగా జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయిన మాజీ చాంపియన్లు వెస్టిండీస్, శ్రీలంక జట్లు సహా మరో ఎనిమిది టీమ్‌లు క్వాలిఫయర్స్ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గ్రూపు-ఏలో ఆతిథ్య జింబాబ్వే, వెస్టిండీస్, నెదర్లాండ్స్, నేపాల్, అమెరికా జట్లను చేర్చగా.. గ్రూపు-బిలో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ జట్లు ఉన్నాయి. మొదటి రౌండ్‌లో రెండు గ్రూపుల నుంచి తొలి మూడు జట్లు సూపర్-6 రౌండ్‌కు చేరుకుంటాయి. అక్కడ టాప్-2లో నిలిచిన రెండు జట్లు క్వాలిఫయర్స్ ఫైనల్‌కు అర్హత సాధించడంతోపాటు వరల్డ్ కప్‌ కూడా క్వాలిఫై అవుతాయి.

Tags:    

Similar News