Champions Trophy2025: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఐసీసీ సంచలన నిర్ణయం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) కుటిల ప్రయత్నాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) అడ్డుకున్నది. బీసీసీఐ(BCCI) సంప్రదింపులతో వెంటనే నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) కుటిల ప్రయత్నాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) అడ్డుకున్నది. బీసీసీఐ(BCCI) సంప్రదింపులతో వెంటనే నిర్ణయం తీసుకుంది. పీవోకేలో ఛాంపియన్ ట్రోఫీ టూర్‌ను రద్దు చేస్తూ శుక్రవారం ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) జరగాల్సి ఉంది. అయితే.. ఐసీసీ షెడ్యూల్ ప్రకటించకముందే.. పాక్ క్రికెట్ బోర్డు ట్రోఫీ టూర్ మొదలు పెట్టింది. పీవోకే(POK)లోని కొన్ని ప్రాంతాలను ఈ ట్రోఫీ టూర్‌లో చేర్చింది. దీంతో ఐసీసీ ముందు బీసీసీఐ పలు అభ్యంతరాలను లేవనెత్తింది.
భారత్ అభ్యంతరాలతో పీవోకే టూర్‌ను ఐసీసీ రద్దు చేసింది. అంతేకాదు.. పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగితే తాము టోర్నమెంట్‌లో పాల్గొనబోమని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం కొనసాగుతోంది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ కోరుతోంది. కానీ, టోర్నమెంట్ ఆతిథ్యాన్ని మరే ఇతర దేశంతో పంచుకోవడానికి పీసీబీ ఇష్టపడడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఐసీసీ ట్రోఫీ టూర్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాలి.