లార్డ్స్ స్టేడియంలో మహిళల తొలి టెస్టు అప్పుడే.. ఆ జట్ల మధ్యే.. ఖరారు చేసిన ఈసీబీ

క్రికెట్‌లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ స్టేడియానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-08-22 12:39 GMT

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ స్టేడియానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఐకానిక్ స్టేడియంలో మహిళల టెస్టు మ్యాచ్ కూడా చూడబోతున్నాం. లార్డ్స్ స్టేడియంలో మహిళల తొలి టెస్టు మ్యాచ్ నిర్వహించబోతున్నట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వెల్లడించింది. ఇప్పటివరకు లార్డ్స్‌లో మహిళల వన్డే మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. 2026లో ఆ స్టేడియంలో మహిళల తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఏకైక మ్యాచ్‌కు లార్డ్స్ ఆతిథ్యమివ్వనుంది. ‘లార్డ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మహిళల తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుందని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఇది నిజంగా ప్రత్యేకమైన సందర్భం. ఆటకు ప్రాముఖ్యత కలిగినది.’ అని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ గౌల్డ్ తెలిపారు. గతేడాది భారత గడ్డపై ఇరు జట్ల మధ్య ఏకైక మ్యాచ్ జరగగా భారత్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

2026లో ఏకైక టెస్టు‌కు ముందు భారత జట్టు వచ్చే ఏడాది పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఆ టూరుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈసీబీ ప్రకటించింది. జూన్ 28 నుంచి జూలై 22 వరకు ఇంగ్లాండ్‌తో భారత మహిళల జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూన్ 28న తొలి టీ20తో టీ20 సిరీస్ మొదలు కానుండగా.. జూలై 2, 4, 9, 12 తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక, జూలై 16, 19, 22 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 

Tags:    

Similar News