యువరాజ్ ఆ రోజు బస్సులో.. ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పిన రోహిత్
జాతీయ జట్టులో చేరిన కొత్తలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనను భయపెట్టాడని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
దిశ, స్పోర్ట్స్ : జాతీయ జట్టులో చేరిన కొత్తలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనను భయపెట్టాడని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్ ఇటీవల ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నాడు. ఈ షోలో హిట్ మ్యాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా ‘జాతీయ జట్టులో చేరిన తొలి రోజుల్లో ఏ సీనియర్ ఆటగాడు మిమ్మల్ని భయపెట్టాడు’ అని హోస్ట్ కపిల్ శర్మ అడగ్గా.. రోహిత్ వెంటనే యువరాజ్ సింగ్ అని చెప్పాడు. అందుకు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్‌ను వివరించాడు. ‘నన్నే అని కాదు. జట్టులోకి ఏ కొత్త ఆటగాడు వచ్చిన అతను సీనియర్ ప్లేయర్‌గా అనుకుంటాడు. నాకు అతను అంత సీనియర్ అని నాకు తెలియదు. ఒక్క రోజు నేను టీమ్ బస్సులో తెలియకుండా అతని సీటులో కూర్చున్నాను. అదే సమస్యగా మారింది. ప్రతి ఒక్క ఆటగాడికి ప్రత్యేకంగా సీట్లు ఉంటాయని నాకు తెలియదు. నన్ను సీట్లో నుంచి లేవాలని యువీ కళ్లతోనే చెప్పాడు. ఆర్పీ సింగ్ నా పక్కన కూర్చున్నాడు. అది యువీ సీటు అని నాకు వివరించాడు. అప్పుడు సీటుపైన పేరు రాశారేమోనని చూశా. అతనికి భయపెట్టడమంటే ఇష్టం.’ అని రోహిత్ వివరించాడు.