Bismah Maroof: పాక్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం..

పాకిస్థాన్ మ‌హిళా జ‌ట్టు మాజీ కెప్టెన్ బిస్మాహ్ మ‌రూఫ్‌ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది.

Update: 2023-07-25 14:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ మ‌హిళా జ‌ట్టు మాజీ కెప్టెన్ బిస్మాహ్ మ‌రూఫ్‌ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. ఆసియా గేమ్స్ 2023లో ఆడనున్న పాక్‌ జట్టు నుంచి తాను తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రక‌టించింది. టోర్నీకి పిల్లలను అనుమ‌తించ‌క‌పోవ‌డంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిస్మాహ్‌ మరూఫ్‌ తెలిపింది. ఆసియా గేమ్స్‌లో పాల్గొనే క్రికెట‌ర్లు త‌మ పిల్లల్ని వెంట తీసుకురావొద్దని ఆసియా గేమ్స్ నిర్వాహ‌కులు నిబంధన పెట్టారు.

దీంతో రెండేళ్ల చంటిబిడ్డను వ‌దిలి వెళ్లడం ఇష్టం లేని మరూఫ్ టోర్నీ నుంచి త‌ప్పుకుంది. బిస్మాహ్ పాక్ జట్టులో 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. ఆమె పాక్‌ తరఫున 108 వన్డేల్లో 2602 పరుగులతో పాటు 44 వికెట్లు, 108 టి20ల్లో 2202 పరుగులతో పాటు 36 వికెట్లు తీసింది.

''దురృష్టవ‌శాత్తూ పాక్ జ‌ట్టు బిస్మాహ్ మ‌రుఫే సేవ‌ల్ని కోల్పోనుంది. పిల్లల్ని వెంట తీసుకురావొద్దనే నియమం కార‌ణంగా ఆమె త‌న చిన్న పాప‌తో చైనాకు రాలేని ప‌రిస్థితి'' అని మ‌హిళ‌ల జ‌ట్టు హెడ్ తానియా మ‌ల్లిక్‌ పేర్కొంది. ఇక ఈ ఏడాది ఆసియా గేమ్స్ సెప్టెంబ‌ర్ 19 నుంచి 26 వ‌రకు చైనాలోని హాంగ్జూ నగరం వేదిక కానుంది.


Similar News