వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ రిటైర్మెంట్.. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్

Update: 2023-09-26 16:24 GMT

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో వీరిద్దరూ చాలా కాలంపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడారు. తాజాగా విరాట్ కోహ్లీపై డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్‌ గెలిస్తే కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోస్యం చెప్పాడు. తాజాగా తన యూట్యూబ్‌ చానెల్‌లో డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘2027 వరల్డ్ కప్ కోసం కోహ్లీ సౌతాఫ్రికా రావడానికి ఇష్టపడతాడని నాకు తెలుసు. చాలా దూరం ఉంది కాబట్టి, అలా జరుగుతుందని చెప్పడం కష్టమే.

ఈ వరల్డ్ కప్‌ను భారత్ గెలిస్తే కోహ్లీ ఇదే చెబుతాడని అనుకుంటున్నా. ‘థ్యాంక్యూ వెరీ మచ్. నేను ఇకపై టెస్టు క్రికెట్, ఐపీఎల్ మాత్రమే ఆడతాను. కుటుంబంతో గడపాలనుకుంటున్నాను. అందరికీ గుడ్ బై’ అని అతడు చెబుతాడేమో.’ అని ఏబీడీ చెప్పాడు. కోహ్లీకి రికార్డులపై దృష్టి ఉండదని, అతని ఉద్దేశం కూడా అది కాదని తెలిపాడు. ‘భారత్ ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటాడు. జట్టు విజయంలో భాగమవ్వాలని ప్రయత్నిస్తాడు. ఆ ఎమోషన్‌నే మనం మైదానంలో చూస్తాం. ముఖ్యంగా అతను ఫీల్డింగ్ చేసేటప్పుడు జట్టు గెలవాలనే భావోద్వేగాన్ని అతనిలో చూడొచ్చు.’ అని చెప్పుకొచ్చాడు.


Similar News